ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతాయని ఆ జట్టు తాత్కలిక సారథి ఇషాన్ కిషన్ అంచనా వేసాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో తొలి సెంచరీ చేసేది తానేనని, పర్పుల్ క్యాప్ తమ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్‌కు దక్కుతుందని జోస్యం చెప్పాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో తలపడనున్న సంగతి తెలిసిందే. తమ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌కు తాత్కలిక సారథ్య బాధ్యతలు అప్పగించింది. అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 2 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఇషాన్ కిషన్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్‌గా టైటిల్ అందుకున్నాడు. ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ముందు ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ఇషాన్ కిషన్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఒక సెంచరీ చేసినా.. మిగతా మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. కానీ ప్రస్తుతం ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న ఇషాన్ కిషన్.. ఫైనల్ చేరే జట్లను అంచనా వేసాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుతాయని చెప్పాడు. ఈ సీజన్‌లో తానే మొదటి సెంచరీ చేస్తానని చెప్పిన ఇషాన్ కిషన్.. జయదేవ్ ఉనాద్కత్ పర్పుల్ క్యాప్ అందుకుంటాడని తెలిపాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లు గెలవడంతో పాటు ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి టైటిల్ అందుకుంది. 2018 (కేన్ విలియమ్సన్), 2024 (పాట్ కమిన్స్)లలో ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది.
కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ పేస్ విభాగాన్ని జయదేవ్ ఉనాద్కత్ నడిపించనున్నాడు. గుజరాత్‌కు చెందిన ఉనాద్కత్.. సౌరాష్ట్రకు ఆడుతాడు. అతను 112 ఐపీఎల్ మ్యాచ్‌లలో 110 వికెట్లు పడగొట్టాడు. కొలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా 8 ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.
అతను ఇప్పటి వరకు పర్పుల్ క్యాప్ గెలవనప్పటికీ 2017లో రైజింగ్ పూణే తరపున 24 వికెట్లతో (12 మ్యాచ్‌లు) సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ 47 బంతుల్లో (106) సెంచరీ బాదాడు.