కూపర్ కానల్లీ కాదు.. వర్షం వల్లే పంజాబ్ గెలిచింది: శుభ్‌మన్ గిల్
లోయరార్డర్ బ్యాటర్ల స్లో బ్యాటింగ్ తమ విజయవకాశాలను దెబ్బతీసిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆఖరి ఐదు ఓవర్లలో వేగంగా పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడినా.. తమ పోరాట పటిమతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. 175-180 పరుగులు చేసి ఉంటే విజయం దక్కేదని అభిప్రాయపడ్డాడు. పిచ్ స్లోగా ఉండటంతో చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడం కష్టమైందన్నాడు. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ సులువైందని తెలిపాడు. చిరు జల్లులతో బంతి తడిచి బ్యాట్‌పైకి ముద్దుగా వచ్చిందన్నాడు.
ఆఖరి ఓవర్లలోనే..
'ఈ మ్యాచ్‌లో ఓడినా మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ చివరి 5-6 ఓవర్లలో మేం వేగంగా పరుగులు చేయలేకపోయాం. ఇది ఏ మాత్రం 210-220 పరుగులు వచ్చే పిచ్‌లా అనిపించలేదు. కానీ మధ్యలో 175-180 పరుగులు చేసినా సరిపోతుందనిపించింది. బంతి పాతబడే కొద్దీ పిచ్ స్లోగా మారింది. షాట్స్ ఆడటం కష్టమైంది. రెండో ఇన్నింగ్స్‌లో వర్షం రావడంతో బంతి తడిసింది. దాంతో బ్యాటింగ్ ఈజీగా మారింది. బంతి ఏ మాత్రం ఆగలేదు. అయినప్పటికీ మేం బంతితో మెరుగైన ప్రదర్శన చేశాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాం.

ప్రసిధ్ కృష్ణతో ముందుగానే బౌలింగ్ చేయించాల్సింది. కానీ అతను సరైన సమయంలోనే వచ్చి ఆటలో ఆఖరి వరకు మమ్మల్ని నిలబెట్టాడు. ప్రసిధ్‌తో ముందుగా బౌలింగ్ చేస్తే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ వికెట్ స్లోగా మారుతున్న క్రమంలో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ అయితే వికెట్లు తీయగలడని నేను భావించాను. ప్రసిధ్ నెట్స్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతనితో ఆలస్యంగా బౌలింగ్ వేయించా.
అతను మాకు దొరికిన ఆణిముత్యం..
అశోక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను తన ఆట కోసం చాలా కష్టపడుతాడు. మాకు దొరికిన ఆణిముత్యం అతను. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అనుభవం సాధించే కొద్దీ విలువైన ఆటగాడిగా మారిపోతాడు. అతను మంచి ఫీల్డర్ కూడా. కొన్ని నెలల క్రితం క్యాంప్‌లో కలిసినప్పుడు కొత్త బంతితో అతను వేసిన బౌలింగ్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. రాబోయే మ్యాచ్‌ల్లో అతని సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది.
ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. దురదృష్టవశాత్తూ ఈ రోజు మాకు కలిసి రాలేదు. కానీ మేం బాగానే ఆడాం. మా ఆట ఇంకా మెరుగవ్వాలి.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
కూపర్ కానల్లీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 6 ఫోర్లతో 39), జోస్ బట్లర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్(3/34) మూడు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కూపర్ కానల్లీ(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/15) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications