6 మ్యాచ్‌ల్లో ఓడినా.. మీటింగ్స్ వద్దని పాంటింగ్‌కు చెప్పా: శ్రేయస్ అయ్యర్
వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడినా టీమ్ మీటింగ్స్ పెట్టవద్దని తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు చెప్పానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తమ ఆటగాళ్లను ఒక్క మాట కూడా అనలేదని, వారు ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వరుసగా 6 పరాజయాల తర్వాత గెలుపొందిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అయ్యర్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతీ బ్యాటర్ బ్యాటర్ కలలుగనే క్షణం ఇది అని చెప్పుకొచ్చాడు.
ముంబై గెలవాలని కోరుకుంటాం..
'ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ. పైగా జట్టుకు ఎంతో అవసరమైన సమయంలో ఇది రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు మేం విజయం సాధించాం. ఈ విజయం మా జట్టులో గొప్ప సానుకూలతను నింపింది. రేపటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)కు మద్దతు ఇస్తూ వారు గెలవాలని ఆశిస్తున్నాం.

మా బౌలర్ల ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి ఓవర్‌లోనే 16 పరుగులు ఇచ్చినప్పటికీ.. అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిరిగి మా నియంత్రణలోకి తీసుకువచ్చాం. అతను వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాకుండా కట్టడి చేశాడు. యుజ్వేంద్ర చాహల్ మాకు మూమెంటమ్ అందించాడు. గత మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చినా ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు.
ప్రతీ బ్యాటర్ కలలుగనే క్షణం ఇది
ఈ రోజు నేను వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనుకున్నాను. అనవసరమైన షాట్స్ ఆడకుండా టైమింగ్‌పై ఫోకస్ పెట్టాను. నేను క్రీజులో ఉండటం ముఖ్యమని భావించాను. క్రీజులో ఉంటే పరుగులు వస్తాయనే విషయం నాకు తెలుసు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన తీరు అమోఘం. ఒక్కరి వల్లే మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు. తను ఎంతటి ప్రతిభావంతుడో ఈ రోజు మరోసారి నిరూపించాడు. అతను మానసికంగా చాలా చురుగ్గా ఉన్నాడు. మైదానంలో మా ఇద్దరి చర్చలు పనిచేశాయి.
విన్నింగ్ షాట్‌తో సెంచరీ అందుకోవడం ప్రత్యేకమైన అనుభూతి. ప్రతీ బ్యాటర్ కలలుగనే క్షణం ఇది. ఈరోజు నాకు అలాంటి ఒక సూపర్ డే. చాలా ప్రశాంతంగా పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. ప్రభ్‌సిమ్రాన్‌తో మా భాగస్వామ్యం కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది.
మీటింగ్ వద్దని చెప్పా..
వరుసగా 6 పరాజయాల తర్వాత మా జట్టుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు. అసలు ఓటముల గురించే చర్చించలేదు. వరుసగా మీటింగ్స్ పెట్టి ఆటగాళ్లపై అనవసర ఒత్తిడిని పెంచాలనుకోలేదు. ఎక్కువగా చర్చలు జరిపితే పాత ఓటములు తలచుకొని గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మా ఆటగాళ్లను వారి మానాన వారిని వదిలేసాం. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో మైండ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉండాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు కల్పించకూడదు.
ఈ రోజు ఎలాంటి మీటింగ్స్ వద్దని రికీ పాంటింగ్‌కు చెప్పాను. నేరుగా గ్రౌండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసుకుందామన్నాను. దానికి తగ్గ ఫలితం దక్కింది.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

