సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, గుజరాత్ టైటాన్స్ బౌలర్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన చేశారని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. పవర్ ప్లేలోనే వికెట్లు తీయకపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు.
'కొత్త బంతితో ఆరంభంలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. ఈ క్రమంలోనే 164 పరుగుల లక్ష్యం సరిపోతుందని నేను భావించా. గుజరాత్ బౌలర్లు ఈ పిచ్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. స్టంప్స్‌పైకి బౌలింగ్ చేసి రూమ్ తీసుకోని ఆడే అవకాశాన్ని ఇవ్వలేదు. మేం పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయాం. ఆ పరిస్థితి నుంచి 160 పరుగులు చేయడం గొప్ప విషయం.

కొత్త బంతితో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ఆరంభంలోనే వికెట్లు తీయాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ మేం చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లిన తీరు అద్భుతం. మా ఆటగాళ్ల దృక్పథం, ప్రణాళికలు చాలా బాగున్నాయి. మేం హార్డ్ లెంగ్త్‌ల్లో బౌలింగ్ చేయడంలో కొద్దిగా విఫలమయ్యాం. ఈ పిచ్‌పై బౌన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మిడ్‌వికెట్ మీదుగా ఆడటం లేదా పుల్ షాట్లు కొట్టడం అంత సులువు కాదు. బ్యాటింగ్ చేయడానికి ఇది సరైన పిచ్ కాదు.
మా వ్యూహాలను అమలు చేయడంలో మేం కొంచెం తడబడ్డాం. అయినప్పటికీ మేం ఇంకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉన్నాం. అదే మాకు ముఖ్యం. ఈ మ్యాచ్ నుంచి మేం సానుకూల అంశాలను తీసుకుంటాం. ఐపీఎల్‌లో ముందుకు సాగే క్రమంలో ఇలాంటి పిచ్‌లపై ఆడటం ఒక మంచి సవాలు. ఎందుకంటే ఇది బౌలర్ల నైపుణ్యాన్ని బయటకు తీస్తుంది. గత మ్యాచ్‌లో 50-60 పరుగులు సమర్పించుకున్న బౌలర్లు, ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఓవర్లు వేయడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేం గెలవాలనుకున్నాం కానీ అది కుదరలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తదుపరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆ మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్స్ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాం. ప్రాక్టీస్‌లో మా ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారు. మైదానం బయట ఎంత కష్టపడుతున్నారు అనేది చాలా ముఖ్యం. జట్టులో సరైన దృక్పథం, పట్టుదల ఉంటే, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మేం మా బెసిక్స్‌కు కట్టుబడి ఉంటూ, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.