MI vs CSK: ఇదేం ఆటరా అయ్యా.. 5 టైమ్ ఛాంపియన్ ఖాతాలో ఐదో ఓటమి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత భారీ విజయంతో గాడిన పడినట్లు కనిపించిన ముంబై తర్వాతి మ్యాచ్‌లోనే చేతులెత్తేసింది. గురువారం వాంఖడే వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఐదో పరాజయం కాగా.. సీఎస్‌కేకు మూడో విజయం. సంజూ శాంసన్ అజేయ శతకం, అకీల్ హోసెన్(4/17) సెన్సేషనల్ బౌలింగ్ సీఎస్‌కేకు భారీ విజయాన్ని అందించాయి.
శతక్కొట్టిన చెటా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్) ఒక్కడే అజేయ శతకంతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(2/37), అల్లా ఘజన్‌ఫర్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 5 ఫోర్లుతో 35), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. డానిష్ మలెవర్(0), నమన్ ధీర్(0), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(0) డకౌట్ కాగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అకీల్ హోసెన్(4/17) నాలుగు వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. నూర్ అహ్మద్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చౌదరీ, అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన అకీల్ హోసేన్..
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో సంజూ శాంసన్ మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దాంతో సీఎస్‌కే 207 పరుగులకే పరిమితమైంది. ఈ 208 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఈజీగా ఛేజ్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలి ఓవర్‌నే స్పిన్నర్ అకీల్ హోసేన్‌తో వేయించి రుతురాజ్ గైక్వాడ్ ఫలితాన్ని రాబట్టాడు. డానిష్ మలేవార్(0)ను అకీల్ డకౌట్ చేయగా.. సిక్సర్‌తో జోరు కనబర్చిన క్వింటన్ డికాక్(7)ను ముఖేష్ చౌదరీ పెవిలియన్ చేర్చాడు.
తన మరుసటి ఓవర్‌లో నమన్ ధీర్(0)ను అకీల్ హోసేన్ డకౌట్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు. మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాంతో పవర్ ప్లేలో ముంబై 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే చేసింది. ఇక్కడే మ్యాచ్ సీఎస్‌కే వశమైంది.
సూర్య, తిలక్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. ఛేదించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో వారిపై ఒత్తిడి పెరిగింది. మిడిల్ ఓవర్లలో మరోసారి బౌలింగ్‌కు దిగిన అకీల్ హోసెన్ సూర్య, తిలక్ వర్మలను పెవిలియన్ చేర్చి ముంబై పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌పై ఆ జట్టు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆటరా అయ్యా అంటూ మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications