సచిన్‌లానే కోహ్లీ తప్పును ఒప్పుకోడు: సంజయ్ మంజ్రేకర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తరహాలోనే విరాట్ కోహ్లీ కూడా తన తప్పిదాన్ని అంగీకరించడని తెలిపాడు. సాకులు వెతికే ప్రయత్నం చేస్తాడని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పిన్స్ యాదవ్ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో డకౌటయ్యాడు. క్లీన్ బౌల్డ్ అయిన అనంతరం పిచ్ వైపు చూస్తూ.. తన తప్పిదం ఏం లేదన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
కోహ్లీ రియాక్షన్ చూశారా..?
కోహ్లీ రియాక్షన్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సంజయ్ మంజ్రేకర్.. సచిన్ వ్యవహారం కూడా ఇలానే ఉండేదని గుర్తు చేసుకున్నాడు. 'ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయిన తీరును గమనిస్తే.. ఒక ఛాంపియన్ బ్యాటర్ మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతోంది. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు.
విరాట్ కోహ్లీ ఔటైన తీరు గురించి నేను చెప్పడం లేదు. విరాట్ ఔట్ అయిన తర్వాత అతని రియాక్షన్‌ను ఒకసారి గమనించండి. అతను ఔట్ అయిన వెంటనే.. పిచ్ వైపు ఏదో ఊహించనిది జరిగినట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. పిచ్ అనూహ్యంగా స్పందించడం వల్లే తాను ఔటయ్యాననే భావనలో అలా చేశాడు.

అది గొప్ప బ్యాటర్ల లక్షణం..
సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్ చివరి దశలో ఔటైనప్పుడు ఇలానే పిచ్‌వైపు చూసేవాడు. బంతి తక్కువ ఎత్తులో వచ్చిందని, పిచ్‌లో ఏదో తప్పు జరిగిందని మాస్టర్ సచిన్ భావించేవాడు. అయితే దిగ్గజ ఆటగాళ్లు ఎప్పుడు తమ తప్పిదాన్ని అంగీకరించరు. తమ తప్పిదాన్ని ఒప్పుకోకుండా సాకుల కోసం వెతుకుతారు. ఇది గొప్ప బ్యాటర్ల లక్షణం. ఎందుకంటే వారు సంవత్సరాలుగా అద్భుతమైన విజయాలను సాధించి ఉంటారు. వారి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్షణాలు ఎదురైనప్పుడు, వారి కాన్ఫిడెన్ ఏమాత్రం తగ్గదు.
సాధారణ ఆటగాళ్లు అయితే.. ఇలా జరిగినప్పుడు వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బంతి చాలా వేగంగా వచ్చిందని లేదా తాము ఆ బంతిని ఆడేంత సమర్థులం కాదని వారు కుంగిపోతుంటారు. కానీ గొప్ప బ్యాటర్లు మాత్రం తాము ఔటవ్వడానికి సహజంగానే ఏదో ఒక కారణాన్ని వెతుకుతారు. ఎందుకంటే వారి సామర్థ్యంపై వారికి అంత నమ్మకం ఉంటుంది.
ఆ మైండ్‌సెట్టే గొప్పవారిగా మార్చింది..
సాధారణ ఆటగాళ్లు త్వరగా ఆత్మవిశ్వాసం కోల్పోతే, గొప్ప ఆటగాళ్లు అలా అవ్వకపోవడమే వారి మధ్య ఉన్న వ్యత్యాసం. వైఫల్యాలను గొప్ప ఆటగాళ్లు చాలా మెరుగ్గా హ్యాండిల్ చేస్తారు. విరాట్ కోహ్లీ రియాక్షన్‌లో, గతంలో టెండూల్కర్ రియాక్షన్‌లో మనం చూసిన ఆ సహజమైన స్పందనే వారిని గొప్పవారిని చేసింది'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే అతన్ని ఔట్ చేశానని మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ తెలిపాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు నిర్దిష్టమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని కోహ్లీ భాయ్ సూచించాడని, ఆ సలహాతోనే అతన్ని క్లీన్ బౌల్డ్ చేయగలిగానని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications