తాను పడిన కష్టానికి ప్రతి ఫలమే ఈ బ్యాటింగ్ ప్రదర్శనని ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ అన్నాడు. ఈ సీజన్ కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పిన సమీర్ రిజ్వీ.. బలహీనతలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరి మెరుగుపర్చుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తోనూ 70 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సమీర్ రిజ్వీ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు.
'నేను నా ఆటపై చాలా కష్టపడ్డాను. ముఖ్యంగా నా బలహీనతలను అధిగమించాను. గతంలో నాకు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉండేది. అందుకే గతేడాది కాలంగా దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాను. నేను ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా ఆడటానికి ప్రయత్నిస్తాను. ఈ మ్యాచ్‌లో కూడా ముందుగా సమయం తీసుకుని, క్రీజులో సెట్ అయిన తర్వాతే నా షాట్లు ఆడాను.

బంతిని సాధ్యమైనంత వరకు గమనిస్తూ ఆడాను. గత మ్యాచ్‌లో కూడా ఇదే చేశాను. ఫామ్‌లో ఉంటే బంతి బ్యాట్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి వేదికలపై పరుగులు సాధిస్తే, మా లాంటి యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.'అని సమీర్ రిజ్వీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పాతుమ్ నిస్సంక(30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) విలువైన పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా ఇది రెండో విజయం.