ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అసాధారణమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పాతుమ్ నిస్సంక(30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) విలువైన పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు.
163 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్(1) మరోసారి నిరాశపర్చగా.. నితీష్ రాణా(0) రనౌటయ్యాడు. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును పాతుమ్ నిస్సంకతో కలిసి సమీర్ రిజ్వీ ఆదుకున్నాడు. స్లోగా ఉన్న వికెట్‌పై ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత ఎదురుదాడికి దిగింది.
ముఖ్యంగా సమీర్ రిజ్వీ భారీ సిక్సర్లతో ముంబై బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. పాతుమ్ నిస్సంక ఔటైనా.. డేవిడ్ మిల్లర్ సాయంతో సెంచరీ దిశగా సాగాడు. తనదైన విధ్వంసంతో మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. విజయం ముంగిట బోష్ బౌలింగ్‌లో రిజ్వీ ఔటైనా.. స్టబ్స్‌తో కలిసి మిల్లర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.