వారి వల్లే ఈ విజయం.. ఆ విషయంలో మేం మారాలి: రుతురాజ్ గైక్వాడ్
బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. తమ బౌలర్లు నెమ్మదిగా గాడిన పడుతున్నారని, జట్టు వ్యూహాలకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. బౌలర్ల సహకారంతోనే 190 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినా తమ ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
బౌలర్లే గెలిపించారు..
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి మేం ఒక మంచి స్కోరును కాపాడుకున్నాం. తొలి 7-8 ఓవర్ల తర్వాత వికెట్ ఒక్కసారిగా మారిపోయింది. బంతి ఆగుతూ వచ్చింది. బంతి స్పిన్ అయ్యింది. దాంతో మేం చేసిన పరుగులు సరిపోతాయనిపించింది. ముందుగా మేం 210 లేదా 220 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ వికెట్ తీరు చూశాక 180-190 స్కోరు సరిపోతుందని భావించాం.

బౌలింగ్‌లో పవర్‌ప్లేలో కట్టడిగా వేసి..రన్ రేట్‌ను కంట్రోల్ చేయడంపై ఫోకస్ పెట్టాం. మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. చాలా మెరుగైంది. నెమ్మదిగా జట్టు అంతా ఒక గాడిలో పడుతోంది. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏమిటో.. ఏ ఓవర్లు వేయాలో.. ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో అర్థమవుతోంది. జట్టు అవసరాలకు అనుగుణంగా బౌలర్లు రాణిస్తున్నారు. ఇది మాకు మంచి సంకేతం.
ఫీల్డింగ్‌లో మెరుగవ్వాలి..
అఖిల్ హొసైన్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని అనుకున్నాం. అతను పవర్‌ప్లే బౌలర్. సునీల్ నరైన్ ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు బంతి గ్రిప్ అవుతుండటంతో అఖిల్‌ను ఉపయోగించాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చాలా కట్టుదిట్టంగా వేశాడు.
ఫీల్డింగ్‌లో మాత్రం మా చేతుల్లోకి వచ్చిన ప్రతి క్యాచ్‌ను వదిలేశాం. కేవలం ఒకటి రెండు మాత్రమే పట్టుకున్నాం. చేతులకు చెమట ఉండటం వల్ల అలా జరిగింది. అయితే ఇది సాకు కాదు. మేం కచ్చితంగా ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి. ఆటగాళ్లకు గెలవాలనే కసి ఉన్నంత వరకు కొన్ని క్యాచ్‌లు వదిలేసినా పర్వాలేదు.
ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది
ముందుగా.. చాలా కాలం తర్వాత గెలిచిన జట్టులో ఉండటం బాగుంది. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అది నన్ను వెంటాడేది. కానీ గత మ్యాచ్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు చాలా బాగుంది. జట్టుకు ఏం కావాలో, పరిస్థితికి తగ్గట్టుగా ఏం చేయాలో దానిపై దృష్టి పెడుతున్నా. మానసికగా కూడా చాలా సానుకూలంగా ఉన్నా. ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడే సమయం దగ్గర్లోనే ఉంది. మిగిలిన ఆటగాళ్లు నాకు అండగా ఉన్నంత వరకు, జట్టుకు అవసరమైనప్పుడు నేను కచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడతాను.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications