రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ వ్యవహారంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మ్యాచ్ సమయంలో డగౌట్‌లో కూర్చొని రోమీ భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగించడం తీవ్ర వివాదాస్పదమైంది.
బీసీసీఐ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, టీమ్ మెంబర్స్ మొబైల్ ఫోన్స్ ఉపయోగించకూడదు. కానీ ఆర్‌సీబీతో మ్యాచ్ జరగుతుండగానే డగౌట్‌లో కూర్చొని రోమీ భిందర్ మొబైల్‌ను ఉపయోగించాడు. అతని పక్కనే ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా మొబైల్‌పై ఓ కన్నేసాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

బీసీసీఐ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, మ్యాచ్ రిఫరీతో పాటు అవినీతి నిరోధక యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. 'ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రదేశం వద్ద ఎవరూ సెల్ ఫోన్లను వాడకూడదు. కానీ, భిందర్ మాత్రం ఆ రూల్స్‌ను ఉల్లంఘించారు. టీమ్ మేనేజర్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ వాడవచ్చు. కానీ డగౌట్‌లోకి తీసుకురాకూడదు.
అయితే, భిందర్ విషయంలో అనుకోకుండా ఇలా జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలి. అయితే మ్యాచ్ రిఫరీతో పాటు ఆంటి కరప్షన్ యూనిట్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది.'అని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
మేనేజర్‌తో పాటు పక్కనే ఉండి మొబైల్ ఫోన్ చూసిన వైభవ్ సూర్యవంశీని కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మందలించే అవకాశం ఉంది. ఆర్‌సీబీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన మెంటార్ రోమీ భిందర్ అని తెలిపాడు. దాంతో అతనిపై ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. అయితే ఇందులో వైభవ్ సూర్యవంశీ తప్పేం లేదని, తెలియక మొబైల్ చూశాడని, తెలిసి ఉంటే చూసేవాడు కాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోమీ భిందర్‌పై నిషేధం పడే అవకాశాలు ఉన్నాయి.