పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి ఎవర్నీ నిందించలేమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పడం కష్టమని, ఏదో ఒక విషయాన్ని ఎత్తి చూపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ఘోర పరాజయం ఎదురైనా సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడుతుందని కొనియాడాడు. ఈ ఓటమిని వీలైనంత త్వరగా మరిచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపాడు.
'నా ఎడమ మోచేతి గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. కానీ ఈ రోజు కుడి చేతికి నేను మరో గాయం చేసుకున్నాను. కాబట్టి నా కోసం మళ్ళీ ఏదో ఒక గాయం కొత్తగా ఎదురుచూస్తూనే ఉంంటుంది (నవ్వుతూ). ఈ రోజు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేం. ఈ ఓటమికి ఏదో ఒక విషయాన్ని మాత్రమే ఎత్తి చూపడం కష్టం. ఎందుకంటే మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ అదే సమయంలో మేం దృష్టి సారించాల్సిన కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.

అయితే ఈరోజు మ్యాచ్‌లో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. మేం చర్చించుకున్నట్లుగా బ్యాటింగ్‌లో కొన్ని మెరుపులు కనిపించాయి. ఖచ్చితంగా ఆ సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఒక జట్టుగా ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం.
మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా ఆడాలనే ఉద్దేశంతోనే ఆయుష్ బదోనీని ఓపెనర్‌గా ఆడించాం. ఈ నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. అతనితో ఓపెనింగ్ చేయించాలని ముందే నిర్ణయించుకున్నాం. దానిని మేం రహస్యంగా ఉంచాం. టాప్ ఆర్డర్‌లో కొంత స్వేచ్ఛ ఉండాలని, మిడిల్ ఆర్డర్ తమ వంతు సహకారం అందించాలని మేం కోరుకున్నాం.

మా జట్టుపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అదే సమయంలో ప్రత్యర్థి జట్టు బాగా ఆడుతున్నప్పుడు.. ముఖ్యంగా ఇప్పుడు పంజాబ్ ఆడుతున్న తీరును చూస్తుంటే, వారు ఆడుతున్న అత్యుత్తమ క్రికెట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ పరాజయాల పరంపరకు ముగింపు పలుకుతాం. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93), కూపర్ కనోల్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) భారీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/25), సిద్దార్థ్(2/35) రెండేసి వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రిషభ్ పంత్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఆయుష్ బదోని(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఎయిడెన్ మార్క్‌రమ్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) పోరాటం సరిపోలేదు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్(2/37) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డుకెక్కింది.
