ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలుస్తుందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేసాడు. ప్రస్తుతం ఉన్న జట్టుతో ఆర్‌సీబీ వరుసగా మరో రెండేళ్లు టైటిళ్లు గెలవవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఆర్‌సీబీ దగ్గర అత్యుత్తమైన విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్ ఉందని చెప్పుకొచ్చాడు. జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వచ్చి, ఫిల్ సాల్ట్ ఫామ్ అందుకుంటే ఆర్‌సీబీకి తిరుగుండదని పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆర్‌సీబీ జట్టును విశ్లేషించిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఐపీఎల్ టైటిల్ గెలవడం ఏ జట్టుకైనా అంత ఈజీ కాదు. ఇప్పుడున్న జట్టుతో ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకుంటుందని భావిస్తున్నా. జట్టు పునర్నిర్మాణంలో ఆర్‌సీబీ చాలా తెలివిగా వ్యవహరించింది. జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వచ్చి.. ఫిల్ సాల్ట్ ఫామ్ అందుకుంటే ఆర్‌సీబీకి తిరుగుండదు. ఆర్‌సీబీ బెంచ్ కూడా చాలా బలంగా ఉంది. హజెల్ వుడ్ గైర్హాజరీలో ఆర్‌సీబీ సాల్ట్, జాకోబ్ బెథెల్‌ను ఆడించవచ్చు.

వేలంలో రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ ఆరంభంలో తుది జట్టులో ఆడతాడని నేను అనుకోవడం లేదు. బ్రదర్.. ఒకసారి వారి విదేశీ ఆటగాళ్లను చూడండి. సాల్ట్, డేవిడ్, షెపర్డ్, బెథెల్. మై గాడ్! ఇది ఒక అత్యుత్తమ విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్. బహుశా టోర్నమెంట్‌లోనే ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ కావచ్చు.
హజెల్ వుడ్ లోటును యష్ దయాల్‌తో భర్తీ చేయవచ్చు. అతను కూడా లేకపోతే కాస్త కష్టమవుతుంది. ఆర్‌సీబీ వద్ద జాకబ్ బెథల్, జాకడ డఫీ, మంగేష్ యాదవ్ ఉన్నారు. ఆర్‌సీబీ ఆడే తొలి మ్యాచ్‌లో ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉండబోతుంది.
ఒకవేళ జాకబ్ బెథెల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తే.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్‌ల్లో ఎవరైనా.. జాకబ్ బెథెల్‌ను కచ్చితంగా ఆడించాలి. అతన్ని ఆడించకుండా ఎలా ఉంటాం? అని భావిస్తే.. జాకోబ్ బెథెల్ జట్టులోకి వస్తాడు. అప్పుడు మంగేష్ యాదవ్ తుది జట్టులో ఆడుతాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మంగేష్ యాదవ్, యష్ దయాల్, సుయాష్ శర్మ(ఇంపాక్ట్ ప్లేయర్).