గుజరాత్ టైటాన్స్ స్పిన్ సెన్సేషన్, అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్(3/17) వికెట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ విన్నర్, ఇన్ ఫామ్ బ్యాటర్ సమీర్ రిజ్వీతో పాటు నితీష్ రాణా, కెప్టెన్ అక్షర్ పటేల్‌లను రషీద్ తన స్పిన్‌తో బోల్తా కొట్టించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సమీర్ రిజ్వీని క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చడంపై రషీద్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. సమీర్ రిజ్వీని రాంగ్ డెలివరీతో బోల్తా కొట్టించానని చెప్పిన రషీద్.. అక్షర్ పటేల్ వికెట్ కోసం ముందే ప్లాన్ చేశానని వెల్లడించాడు.
'ఈ మ్యాచ్ సాగిన విధానం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ ఉత్కంఠ పోరులో గెలవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. గత 7-8 నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వడం, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా శరీరం బాగా సహకరిస్తోంది. నా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అయ్యింది. సరైన ప్రదేశాల్లో బంతులు వేస్తూ రెండు వైపులా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
ఈ మ్యాచ్‌లో నా బెస్ట్ వికెట్ సమీర్ రిజ్వీని ఔట్ చేయడమే. చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి వికెట్ దక్కింది. ఒక లెగ్ స్పిన్నర్‌గా.. రాంగ్ డెలివరీ(గూగ్లీ)తో బ్యాటర్‌ను బోల్తా కొట్టించి వికెట్ తీయడం అనేది ఎప్పుడూ గొప్ప అనుభూతే. ఇది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

అక్షర్ పటేల్ వికెట్ కోసం ప్రాక్టీస్‌లోనే ప్లాన్ చేశాను. నేను ఆఖరి ఓవర్ వేస్తున్నప్పుడు అక్షర్ పటేల్ క్రీజులో ఉంటే.. రిస్క్ తీసుకోవాలనుకున్నాను. అతను బౌండరీ బాదినా.. వికెట్ తీయడమే ముఖ్యమని భావించాను. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతిని వేయడంతో అతని వికెట్ దక్కింది.
ఇది అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల్లో ఒకటి. గత నాలుగైదు ఏళ్లుగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఇలాంటి క్లోజ్ గేమ్స్‌లో భాగమవుతూనే ఉంది. దాంతో చివర్లో భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగాం. ప్రతి బంతిపై ఏకాగ్రత పెట్టడం, మన వంతు వంద శాతం కష్టపడటం, బ్యాటర్ కొట్టడానికి కష్టమయ్యే బంతులు వేయడంపైనే మేం దృష్టి పెట్టాం. చివరికి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
సాధారణంగా లెగ్ స్పిన్నర్ వేసే బంతి పిచ్ పైన పడిన తర్వాత కుడి చేతి వాటం బ్యాటర్‌కు దూరంగా అంటే లెగ్ సైడ్ నుంచి ఆఫ్ సైడ్ వైపు వెళ్తుంది. అలాకాకుండా బంతి ఆఫ్ సైడ్ పడి లోపలికి వస్తే రాంగ్ డెలివరీ అంటారు. లెగ్ స్పిన్నర్ తన యాక్షన్‌ను మార్చకుండానే.. బంతిని వేసేటప్పుడు చేతిని తిప్పే విధానాన్ని స్వల్పంగా మారుస్తాడు. దీనివల్ల బంతి పిచ్ పైన పడిన తర్వాత బ్యాటర్‌కు దూరంగా వెళ్లకుండా.. లోపలికి అంటే ఆఫ్ సైడ్ నుంచి లెగ్ సైడ్ వైపు వస్తుంది. దీన్నే గూగ్లీ అంటారు.
బ్యాటర్ ఆ బంతిని సాధారణ లెగ్ స్పిన్ అనుకుని ఆడబోతాడు. కానీ అది అనూహ్యంగా లోపలికి రావడంతో క్లీన్ బౌల్డ్ అవ్వడం లేదా ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమీర్ రిజ్వీ కూడా ఇలానే పొరబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.