ఆ పనికిమాలిన నిర్ణయమే గుజరాత్ కొంపముంచింది: అశ్విన్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. వారు తీసుకున్న పనికిమాలిన నిర్ణయమే గుజరాత్ టైటాన్స్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా విఫలమైన గుజరాత్ టైటాన్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ భారీ విజయంతో ఆర్‌సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. గుజరాత్ టైటాన్స్‌కు క్వాలిఫయర్-2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. కీలకమైన క్వాలిఫయర్-1లో కుల్వంత్ ఖేజ్రోలియాను ఎందుకు ఆడించారో తనకు అర్థం కావడం లేదన్నాడు. అతను ఒకే ఓవర్‌లో 28 పరుగులు ఇచ్చాడని, అది మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయాలు, బౌలింగ్ మార్పులు కూడా సరిగ్గా లేవని విమర్శించాడు.
కెప్టెన్‌గా గిల్ తప్పిదాలు
'రషీద్ ఖాన్‌కు ఈ సీజన్ అంత బాగా సాగలేదు. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం స్పిన్నర్లకు అంత గొప్పగా ఏమీ లేదు. కానీ మిగతా స్పిన్నర్లతో పోలిస్తే రషీద్ ఖాన్‌కు ఇది కాస్త మెరుగైన సీజన్ అని చెప్పవచ్చు. అయితే, ఏడో ఓవర్ లోనే రషీద్‌ను బౌలింగ్‌కు దించకుండా శుభ్‌మన్ గిల్ ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఈ ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా కాకపోయినా.. మెరుగైన కెప్టెన్లలో ఒకడిగా రాణించాడు. ముఖ్యంగా అతను తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్న విధానానికి నేను హాట్సాఫ్ చెప్తాను. అయితే వారి జట్టులో కొన్ని బలహీనతలు, లోపాలు ఉన్నాయి. వాటిని వారు హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుని కవర్ చేశారు.
ఆ ఒక్క ఓవర్‌తో..
తటస్థ వేదికలో ఆర్‌సీబీ.. గుజరాత్ టైటాన్స్ లోపాలను బట్టబయలు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం చాలా కీలకం. శుభ్‌మన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈరోజు వారు కుల్వంత్ ఖేజ్రోలియాను ఎందుకు ఆడించారో నాకు అస్సలు అర్థం కాలేదు. మీరు ఎవరినైనా ఆడించాలనుకుంటే, వారి బౌలింగ్‌లో ఏదైనా మిస్టరీ ఉండాలి. అతనేమీ మిస్టరీ స్పిన్నర్ లేదా మిస్టరీ బౌలర్ కాదు. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. 15వ ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. అది ఆటను పూర్తిగా మార్చేసింది.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 255 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించగా.. గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications