ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రవీచంద్రన్ అశ్విన్ కీలక సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లో దూకుడు తగ్గించి, క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలన్నాడు. బంతిని గాల్లోకి లేపకుండా.. సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే తరహాలో గ్రౌండెడ్ షాట్స్ ఆడాలని సూచించాడు.
మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్ పుంజుకోవాలంటే ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడు కావాలని అభిప్రాయపడ్డాడు. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ గురించి జియో హాట్‌స్టార్‌లో మాట్లాడిన అశ్విన్.. సీఎస్‌కే వరుస విజయాలు సాధిస్తున్నా.. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్‌గా సత్తా చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
'వరుసగా రెండు విజయాలు కెప్టెన్‌గా రుతురాజ్‌కు పెద్ద ఊరటనిస్తుంది. కానీ అతను బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అతను తిరిగి ఫామ్ అందుకోవాలంటే బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలను సరిచేసుకోవాలి. టీ20 అంటేనే దూకుడుగా ఆడటం అయినప్పటికీ.. రుతురాజ్ బౌలర్ లైన్ దాటి మరీ ముందుకు వచ్చి త్వరగా వికెట్ పారేసుకుంటున్నాడు.

ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్ తరహాలో గ్రౌండెడ్ షాట్స్ ఆడాలి. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త నిదానంగా వ్యవహరించి, బంతిని సరిగ్గా టైమింగ్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే రుతురాజ్ తన ఫామ్‌ను తిరిగి పొందుతాడు.
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో నేనున్నా ఆందోళన చెందను. కెప్టెన్‌గా సాధించిన విజయాలు అతనిపై ఒత్తిడిని తగ్గిస్తాయి.’అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ పుంజుకోవాలంటే ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడు రావాలని అశ్విన్ తెలిపాడు. గతంలోనూ కేకేఆర్ ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకొని విజేతగా నిలిచిందని గుర్తు చేశాడు. 'ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు కొత్త శక్తి అవసరం. కేవలం పతిరానా వంటి స్టార్లపైనే ఆధారపడకుండా, డగౌట్‌లో ఉన్న కొత్త ప్రతిభను వెలికితీయాలి.
కేకేఆర్ వద్ద తేజస్వి దహియా, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ సౌరభ్ దూబే వంటి ప్రతిభావంతులు ఉన్నారు. వారికి అవకాశం ఇస్తే జట్టు రూపురేఖలు మారుతాయి. ఐపీఎల్ 2021లో వెంకటేష్ అయ్యర్ జట్టులోకి వచ్చి ఎలాగైతే ఊపు తెచ్చాడో.. ఇప్పుడు కూడా అలాంటి ఒక 'ఎక్స్-ఫాక్టర్' ఆటగాడు కేకేఆర్‌కు అవసరం.’అని అశ్విన్ స్పష్టం చేశాడు.