IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఫసక్.. ఫైనల్‌కు ఆర్‌సీబీ!
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటి రెండో టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.
ఆర్‌సీబీ చేతిలో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో రెండో అవకాశం ఉంది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్‌సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది.
రజత్ పాటిదార్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ(2/54), జాసన్ హోల్డర్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(1/53) ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాహుల్ తెవాటియా(43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోస్ బట్లర్(11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) పర్వలేదనిపించాడు. ఈ ఇద్దరూ మినహా అంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.

నిప్పులు చెరిగిన ఆర్‌సీబీ బౌలర్లు..
255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కమ్ ఓపెనర్ అయిన సాయి సుదర్శన్ దురదృష్టకర రీతిలో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. జాకోబ్ డఫీ బౌలింగ్‌లో బౌండరీ బాదిన సాయి సుదర్శన్.. ఆ షాట్ ఆడే క్రమంలో బ్యాట్‌ను వదిలేసాడు. అది కాస్త వికెట్లపై పడింది. దాంతో సాయి సుదర్శన్(14) నిరాశగా పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఓపెనర్లు ఔటైనా జోస్ బట్లర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని జోష్ హేజిల్‌వుడ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు(5), జాసన్ హోల్డర్(0)లను రసిక్ సలామ్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పరువు కాపాడిన తెవాటియా..
పవర్ ప్లే అనంతరం ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన వాషింగ్టన్ సుందర్(8)ను జాకోబ్ డఫీ క్యాచ్ ఔట్ చేయగా.. రషీద్ ఖాన్(8)ను తన ఆఖరి ఓవర్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. కగిసో రబాడ(5)ను కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయగా.. రాహుల్ తెవాటియా ఆర్‌సీబీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో వేగంగా పరుగులు రాబట్టాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రాహుల్ తెవాటియా.. సిరాజ్‌తో కలిసి 9వ వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. తెవాటియాను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేయగా.. సిరాజ్(5)ను కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications