IPL 2026: ముంబై, లక్నో ఔట్.. ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లు ఇవే!
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. దాంతో ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటికే 54 లీగ్ మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి.
నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం 8 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన ఆర్‌సీబీ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచాయి.

ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే..
ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కనుండగా.. పంజాబ్ కింగ్స్, సీఎస్‌కే, రాజస్థాన్ రాల్స్ రెండు విజయాలు నమోదు చేయాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు తక్కువగా ఉండగా.. కేకేఆర్ మిగిలిన 4 మ్యాచ్‌లకు 4 గెలవాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్, విజయాల ప్రకారం ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
8 జట్ల ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఏంటంటే..?
ఆర్‌సీబీ: 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాటు మెరుగైన రన్‌రేట్ +1.103తో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్‌సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే మరో విజయం సాధించాలి. ఆర్‌సీబీ తమ చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలిస్తే టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్ 1కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి ఆర్‌సీబీకి రెండు అవకాశాలు లభిస్తాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆరెంజ్ ఆర్మీ కూడా 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, +0.737 రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించాలంటే తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ఒక్క మ్యాచ్ విజయం సాధిస్తే రన్‌రేట్ మెరుగ్గా ఉండాలి. టాప్-2లో నిలవాలంటే.. మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాలి.
గుజరాత్ టైటాన్స్: 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు +0.228 రన్‌రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ఒక్క మ్యాచ్ గెలిస్తే.. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలి.
పంజాబ్ కింగ్స్: 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కనుంది. ఢిల్లీ, ముంబై, ఆర్‌సీబీ, లక్నోతో పంజాబ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్: 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో సీఎస్‌కే ఐదో స్థానంలో కొనసాగుతోంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. మూడింటికి మూడు గెలిస్తే ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
రాజస్థాన్ రాయల్స్: ఈ టీమ్ కూడా 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మూడు మ్యాచ్‌లకు మూడు గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది.
కేకేఆర్: ఈ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాలి. 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో కేకేఆర్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలవాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్: 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలొకొంది. ఇతర జట్ల ఫలితాలు కలిసొస్తేనే ఢిల్లీ టోర్నీలో ముందడుగు వేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications