ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మెరుగైన ప్రదర్శన చేస్తుందని మాజీ క్రికెటర్ పియూష్ చావ్లా అంచనా వేసాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, యువ ప్లేయర్ ఆయుష్ మాత్రేలతో చెన్నై సూపర్ కింగ్స్ స్వరూపం మారిపోయిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరూ సీఎస్‌కే మ్యాచ్ విన్నర్లు అని కొనియాడాడు.
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో శివమ్ దూబే ఒకడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌పై నమ్మకం ఉంచిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వరుసగా అతన్ని అంటిపెట్టుకుంటుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లోనూ శివమ్ దూబే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న అతను ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తాడని పీయూష్ చావ్లా జోస్యం చెప్పాడు.
అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎస్‌కే బలాల గురించి మాట్లాడిన పీయూష్ చావ్లా.. శివమ్ దూబే, ఆయుష్ మాత్రేలు పోషించే పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంతో శివమ్ దూబే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు అతను కాస్త సమయం తీసుకుంటాడు. సెట్ అయిన తర్వాత మ్యాచ్ స్వరూపాన్ని ఎలా మార్చేయవచ్చో అతనికి బాగా తెలుసు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఉంటే జరిగే మేలు ఇదే.

మెగా టోర్నీలో భారత జట్టు కోసం శివమ్ దూబే పోషించిన పాత్ర ఇదే. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ దూబే అదే పాత్రను పోషించాలని సీఎస్‌కే ఆశిస్తుంది. మిడిల్ ఓవర్లలో వచ్చి శివమ్ దూబే విలువైన పరుగులు చేస్తాడని భావిస్తోంది. అతనిపై చాలా పెద్ద బాధ్యత ఉంది.
ఆయుష్ మాత్రే నుంచి కూడా సీఎస్‌కే ఇదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. అతను గత సీజన్‌లో ఆడిన తీరుతో భారీ అంచనాలను పెట్టుకుంది. ముఖ్యంగా గత సీజన్‌లో అతను ఆడిన విధానం బాగుంది. టీ20 ఫార్మాట్‌లో ఓ ఆటగాడు ఇలానే రాణించాలని మేం తరుచూ మాట్లాడుకుంటాం. అతను అదే ప్రదర్శనను కనబర్చాడు. అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అతని ఆత్మవిశ్వాసం కచ్చితంగా రెట్టింపు అయ్యి ఉంటుంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను ఓపెనర్‌గా కాకుండా 3 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి వారి నుంచి అతను మరింత నేర్చుకుంటాడు. శివమ్ దూబే, ఆయుష్ మాత్రే తమ ఫామ్ కొనసాగిస్తే సీఎస్‌కేకు తిరుగుండదు.'అని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే 8 ఇన్నింగ్స్‌ల్లో 169.06 స్ట్రైక్‌రేట్‌తో 235 పరుగులు చేశాడు. అతను ఐపీఎల్ 2025 సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌ల్లో అతను 14 ఇన్నింగ్స్‌ల్లో 132.22 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆయుష్ మాత్రే 7 ఇన్నింగ్స్‌ల్లో 188.97 స్ట్రైక్‌రేట్‌తో 240 పరుగులు చేశాడు.