వాడి బ్యాటింగ్‌కు పిచ్చోడినయ్యా.. మా ఓటమికి కారణం అదే: ప్యాట్ కమిన్స్
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌కు తాను పిచ్చోడినయ్యానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అతను ఆడుతున్నంత సేపు ఏం చేయాలో తనకు తోచలేదని చెప్పాడు. ఏ బంతి వేసినా అతను బౌండరీకి తరలించాడని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ పరాజయంతో SRH ఇంటిబాట పట్టింది.
వాడి బ్యాటింగ్‌కు పిచ్చోడినయ్యా..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. రాంగ్ టైమ్‌లో కీలక వికెట్లు కోల్పోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని అభిప్రాయపడ్డాడు. 'వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

అతని బ్యాటింగ్‌కు నేను పిచ్చోడినయ్యా. అతను అలా ఆడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కువ ఆప్షన్స్ లేవనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. యార్కర్ కొంచెం మిస్సైనా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్ తరలిస్తున్నాడు. అతని ఆటను అభినందించాల్సిందే.
ఎలాంటి పశ్చాత్తాపం లేదు..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే పిచ్ చివరి వరకు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మేం పరిపూర్ణమైన జట్టుగా నిలిచాం. కుర్రాళ్ల ప్రతిభను వెలికితీసాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు.
ఈ కుర్రాళ్లకు అంతగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న అత్యంత యువ జట్లలో ఈ ఏడాది మాది కూడా ఒకటి. ఇది మా కోచింగ్ సిబ్బంది ఎంతటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెలికితీశారో తెలియజేస్తోంది. కాబట్టి ఒక కెప్టెన్‌గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది.
ఛేదించాల్సిన లక్ష్యమే..
240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా కలిసి రావాలి. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కావాల్సిన పిచ్ ఏదైనా ఉందా? అంటే అది ఇదే. మేం ఇన్నింగ్స్ మొత్తంలో దాదాపు ఛేదించాల్సిన రన్‌రేట్‌తోనే కొనసాగాం. కానీ తప్పుడు సమయంలో కీలకమైన వికెట్లు కోల్పోయాం. అది మా విజయవకాశాలను దెబ్బతీసింది.
అయినప్పటికీ మేం గెలవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాం. గత మూడేళ్లలో మేం రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేరాం. కొద్ది తేడాతో టాప్-2 ప్లేస్‌ను కోల్పోయాం. ఈ సీజన్‌లో మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. ముఖ్యంగా మేం ఆడిన విధానం బాగుంది. మా కుర్రాళ్లు ఆటను బాగా ఆస్వాదించారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications