తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌లో 39 పరుగులు చేసిన నితీష్ బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీసాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఫిట్‌గా మార్చిన ఫిజియోలు, ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రదర్శన క్రెడిట్ వారిదేనని స్పష్టం చేశాడు.
'చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసమే నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను ఆ ప్రదర్శనను కనబరిచాను. నా బౌలింగ్‌లో కూడా కీలక వికెట్లు తీయడంతో పాటు పరుగులను అడ్డుకోగలిగాను. గత కొన్ని నేలలుగా నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను కేవలం సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నా మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉండేవి.
గత సీజన్ నేను కోరుకున్నట్లుగా సాగలేదు. చాలా గాయాలయ్యాయి. గత సీజన్‌లో నేను బౌలింగ్ చేయలేదు. అందుకే నా బౌలింగ్‌పై కొంచెం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. మధ్యలో నాకు కొంత విరామం దొరికింది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నా బౌలింగ్‌పై చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మైదానంలో కనిపిస్తోంది. అందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. నన్ను జాగ్రత్తగా చూసుకున్న ట్రైనర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలు.'అని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు.
అనంతరం కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించినా.. రింకూ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), ఫిన్ అలెన్(7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/21) మూడు వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/14), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ష్‌దూబేకు ఒక వికెట్ దక్కింది.