Raghu Sharma: వికెట్ తీసి.. జైశ్రీరామ్ నోట్ చూపించిన ముంబై స్పిన్నర్!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. 33 ఏళ్ల ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ రఘు శర్మ.. ఈ మ్యాచ్‌లో తొలి ఐపీఎల్ వికెట్ అందుకున్నాడు.
ఈ వికెట్ తీసిన వెంటనే తన జేబులో నుంచి ఒక నోట్ తీసి ప్రేక్షకులవైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి అక్షత్ రఘువంశీ (11)ని రఘు శర్మ క్యాచ్ ఔట్ చేశాడు. తద్వారా తన 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. దాంతో అతని సంతోషానికి హద్దే లేకుండాపోయింది. ముందే ఒక నోట్ రాసిపెట్టుకొని జేబులో తెచ్చుకున్న రఘుశర్మ.. వికెట్ తీసిన వెంటనే ప్రేక్షకుల వైపు చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఆ నోట్‌లో.. 'రాధే రాధే. గురుదేవుల కృపతో నా 15 ఏళ్ల సుదీర్ఘమైన, బాధాకరమైన నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్.'అని రాసి ఉంది.

ఈ సెలెబ్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన లక్ష్యం కోసం 15 ఏళ్లుగా కష్టపడుతున్న అతని పట్టుదలను మెచ్చుకుంటున్నారు. వయసు పైబడినా.. సరైన అవకాశాలు రాకున్నా.. పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమని కొనియాడుతున్నారు.
కట్టుదిట్టమైన బౌలింగ్..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రఘు శర్మ.. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడిగా బౌలింగ్ చేశాడు.
తాజా మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 36 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. 10 కంటే తక్కువ ఎకానమీని మెయింటైన్ చేసిన ఏకైక బౌలర్‌గా రఘు శర్మ నిలిచాడు.
ఎవరీ రఘు శర్మ?
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ లెగ్ స్పిన్నర్ 2017లో రంజీ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2021లో లిస్ట్-ఏ, టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో పరిమిత అవకాశాలు లభించినప్పటికీ, 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
గతేడాది విఘ్నేష్ పుతార్ స్థానంలో ముంబై ఇండియన్స్ రఘు శర్మను జట్టులోకి తీసుకుంది. గత సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా.. అతని ప్రతిభను గుర్తించిన ముంబై యాజమాన్యం ఈ ఏడాది రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ ఆరంభంలో అవకాశాలు ఇవ్వకపోయినా.. గత మ్యాచ్‌లో బరిలోకి దింపింది. అద్బుతంగా బౌలింగ్ చేయడంతో తుది జట్టులో కొనసాగిస్తోంది. 33 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకున్న రఘు శర్మ ప్రయాణం, యువ క్రికెటర్లకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications