ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టును విశ్లేషించిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ డెత్ బౌలింగ్ బలహీనంగా ఉందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే బౌలర్ లేడని పేర్కొన్నాడు. కొత్త బంతితో మహమ్మద్ సిరాజ్ రాణించినా.. డెత్ ఓవర్లలో అతనిపై నమ్మకం ఉంచలేమని, గత సీజన్ చివరి మూడు మ్యాచ్‌ల్లో అతను ధారళంగా పరుగులిచ్చుకున్నాడని గుర్తు చేశాడు.
అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడిన కైఫ్.. డెత్ బౌలింగ్‌ను మెరుగుపర్చుకుంటే గుజరాత్ టైటాన్స్‌కు తిరుగుండదని తెలిపాడు. 'సిరాజ్ కొత్త బంతితో వికెట్లు తీసే బౌలర్. ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తాడు. బంతిని బలంగా పిచ్ చేయడం అతని బలం. అహ్మదాబాద్ గ్రౌండ్ చాలా పెద్దది. స్క్వేర్ బౌండరీలు కూడా దూరంగా ఉంటాయి. ప్రసిధ్ కృష్ణ మిడిల్ ఓవర్లలో హార్డ్ లెంగ్త్స్ వేస్తాడు. కాబట్టి జట్టులో అతని పాత్ర ఏంటో నాకు అర్థమవుతోంది.

ప్రసిద్ధ్ కృష్ణ తన స్లోయర్ బంతులను కూడా మెరుగుపర్చుకున్నాడు. బంతి డిప్ అయ్యి వికెట్లు తీస్తున్నాడు. కానీ ఆ జట్టులో డెత్ బౌలింగ్ లోపం కనిపిస్తోంది. కగిసో రబడా కూడా పరుగులిచ్చేస్తున్నాడు. సిరాజ్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. నేను గత ఏడాది జరిగిన చివరి మూడు, నాలుగు మ్యాచ్‌ల గురించి మాట్లాడుతున్నాను. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆ సమయంలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
గుజరాత్ జట్టులో ప్రతి ఆటగాడికి ఇద్దరు బ్యాకప్ ప్లేయర్లు ఉన్నారు. వేలంలో ఎప్పుడూ గుజరాత్ గెలుస్తోంది. ఇతర జట్లతో పోలిస్తే వీరి ఆక్షన్ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. అయితే గతేడాది మొదటి 12 మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి టేబుల్ టాప్‌లో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత టాప్-2లో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో వారు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. వారు వరుసగా తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు.
ప్రత్యర్థి జట్లు గుజరాత్‌పై 225 వరకు పరుగులు సాధించాయి. దాంతో వీరి బౌలింగ్ బలహీనత బయటపడింది. ఆరంభంలో బౌలింగే వారి బలం అనుకున్నాం. కానీ ప్రధాన టోర్నీ చివరి దశకు వచ్చేసరికి.. టాప్-2లో ఉండటానికి ఒక్క మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో వరుసగా మూడు ఓడిపోయారు. ఒత్తిడిలో బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. కాబట్టి ఈసారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై కూడా వారు ప్రత్యేక దృష్టి సారించాలి.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.