ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్‌కు తెరలేవనుంది. ఈసారి 10 జట్లలో గరిష్టంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో 110 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా.. 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు రూ. 237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉండగా.. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.75 కోట్లు ఉన్నాయి.
ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఢిల్లీ పంత్‌ను తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయగా.. లక్నో రికార్డ్ ధరను బిడ్ చేసి పంత్‌ను చేజిక్కించుకుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఈ రికార్డ్ బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పంత్ రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆల్‌రౌండర్ కోసం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడే అవకాశం ఉంది. మిగతా ఫ్రాంచైజీలు కూడా వ్యూహాత్మకంగా అతని ధరను పెంచే ప్రయత్నం చేయవచ్చు. కామెరూన్ గ్రీన్ రూ. 20 నుంచి రూ27.5 కోట్లు పలికే ఛాన్స్ ఉంది. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ స్థానాన్ని కామెరూన్ గ్రీన్‌తో భర్తీ చేయాలనే లక్ష్యంతో కేకేఆర్ ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మిడిలార్డర్ ఆల్‌రౌండర్ అవసరం ఉంది.
సీఎస్‌కేకు ఫినిషర్ పాత్ర పోషించే ఆల్‌రౌండర్ కావాలి. ఈ మూడు జట్లు కామెరూన్ గ్రీన్ కోసం తీవ్రంగా పోటీపడనున్నాయి. రూ.64.3 కోట్ల ప్రైజ్‌మనీ కలిగిన కేకేఆర్‌కు అతన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత రూ.43.4 కోట్ల పర్స్ మనీతో ఉన్న సీఎస్‌కేకు అవకాశం ఉంటుంది. రూ.20 కోట్ల లోపు పలికితేనే సన్‌రైజర్స్ కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఆ జట్టు దగ్గర రూ.25.5 కోట్లు మాత్రమే ఉన్నాయి.
| సంవత్సరం | ఆటగాడు (జట్టు) | ధర (రూపాయల్లో) |
| 2008 | ఎం.ఎస్. ధోని (CSK) | 9.5 కోట్లు |
| 2009 | కెవిన్ పీటర్సన్ (RCB), ఆండ్రూ ఫ్లింటాఫ్ (CSK) | 9.8 కోట్లు |
| 2010 | షేన్ బాండ్ (KKR), కీరన్ పొలార్డ్ (MI) | 4.8 కోట్లు |
| 2011 | గౌతమ్ గంభీర్ (KKR) | 14.9 కోట్లు |
| 2012 | రవీంద్ర జడేజా (CSK) | 12.8 కోట్లు |
| 2013 | గ్లెన్ మ్యాక్స్‌వెల్ (MI) | 6.3 కోట్లు |
| 2014 | యువరాజ్ సింగ్ (RCB) | 14 కోట్లు |
| 2015 | యువరాజ్ సింగ్ (DD) | 16 కోట్లు |
| 2016 | షేన్ వాట్సన్ (RCB) | 9.5 కోట్లు |
| 2017 | బెన్ స్టోక్స్ (RPS) | 14.5 కోట్లు |
| 2018 | బెన్ స్టోక్స్ (RR) | 12.5 కోట్లు |
| 2019 | జయదేవ్ ఉనద్కట్ (RR), వరుణ్ చక్రవర్తి (KXIP) | 8.4 కోట్లు |
| 2020 | పాట్ కమిన్స్ (KKR) | 15.5 కోట్లు |
| 2021 | క్రిస్ మోరిస్ (RR) | 16.25 కోట్లు |
| 2022 | ఇషాన్ కిషన్ (MI) | 15.25 కోట్లు |
| 2023 | సామ్ కరన్ (PBKS) | 18.5 కోట్లు |
| 2024 | మిచెల్ స్టార్క్ (KKR) | 24.75 కోట్లు |
| 2025 | రిషబ్ పంత్ (LSG) | 27 కోట్లు |