ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 28(శనివారం)న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు సన్నాహకాలు మొదలుపెట్టాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.
అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా 10 ఫ్రాంచైజీలు భారత కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇలా భారత సారథులతో ఒక సీజన్ ప్రారంభం కావడం 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. పేరుకు ఇండియన్ ప్రిమియర్ లీగ్ అయినా.. విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తుది జట్టులో ఆడేది నలుగురే అయినా.. విదేశీ ఆటగాళ్ల ప్రభావం ఈ లీగ్‌పై ఎక్కువగానే ఉంటుంది.

పలువురు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్లుగా కూడా వ్యవహరించారు. కానీ గత 18 సీజన్ నుంచి ఉన్న ఒరవడికి ఈసారి మాత్రం తెరపడింది. తొలిసారి భారత ఆటగాళ్ల సారథ్యంలో 10 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. పలువురు విదేశీ కెప్టెన్లు గాయపడటంతో ఇది సాధ్యమైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మోకాలి గాయంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నియమించింది. మిగతా 9 జట్లకు భారత ఆటగాళ్లే సారథులుగా ఉండటంతో.. ఈ సీజన్‌లో విదేశీ ఆటగాడు కెప్టెన్‌గా లేకుండా పోయాడు.
1. సన్‌రైజర్స్ హైదరాబాద్-ఇషాన్ కిషన్
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)-రజత్ పటీదార్
3. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)-అజింక్యా రహానే
4. ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా
5. లక్నో సూపర్ జెయింట్స్-రిషభ్ పంత్
6. గుజరాత్ టైటాన్స్-శుభ్‌మన్ గిల్
7. పంజాబ్ కింగ్స్-శ్రేయస్ అయ్యర్
8. చెన్నై సూపర్ కింగ్స్-రుతురాజ్ గైక్వాడ్
9. రాజస్థాన్ రాయల్స్-రియాన్ పరాగ్
10. ఢిల్లీ క్యాపిటల్స్-అక్షర్ పటేల్