బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ 2026 మ్యాచ్‌లకు ప్రతీ ఎమ్మెల్యేకు నాలుగు వీఐపీ టికెట్లు అందించాలని కర్ణాటక శాసనసభ స్పీకర్ యుటి ఖాదర్ ఇచ్చిన ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎందుకు వీఐపీ టికెట్లు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఐపీఎల్‌ను అభిమానులు సృష్టించారని, ఎమ్మెల్యేలకు టికెట్లు ఎందుకివ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ తమకు కేవలం ఒకే ఒక వీఐపీ టిక్కెట్ ఇస్తున్నారని, సాధారణ ప్రజలతో కలిసి కూర్చోవాలని చెబుతున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మార్చి 28న మ్యాచ్ ఉన్నా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. తాము సామాన్య ప్రజల్లా క్యూలో నిల్చోలేమని, గతేడాది తమను లైన్లో నిలబెట్టి సాధారణ గ్యాలరీకి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నుంచి భద్రతతో సహా అన్ని సౌకర్యాలు పొందుతున్న క్రికెట్ అసోసియేషన్, ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా రూ.5 వేల టికెట్‌ను రూ.35 వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నారని స్పికర్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రతీ ఎమ్మెల్యేకు నాలుగు వీఐపీ టికెట్లు ఇవ్వాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ను స్పీకర్ ఆదేశించారు.
ఈ నిర్ణయాన్ని ప్రముఖ వ్యాపార వేత్త హర్షా గోయెంకా తప్పుబట్టారు. స్పీకర్ నిర్ణయానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మేం సామాన్య ప్రజల్లా క్యూలో నిల్చోలేం అని మన ప్రజాప్రతినిధులు అంటున్నారు. కానీ, అదే సామాన్య ప్రజలు క్యూలలో నిల్చొని ఓట్లు వేస్తేనే కదా వీరు అధికారంలోకి వచ్చింది! వారు అనుభవిస్తున్న ఈ వ్యవస్థకు డబ్బులు చెల్లించేది కూడా ఆ ప్రజలే. అలాంటిది, 'అధికార హోదా మొదలైన చోట 'సమానత్వం' అంతమైపోతుందని వారికి చెప్పడం నిజంగా విచారకరం. ఇది చాలా విచిత్రమైన న్యాయం!'అని హర్షా గోయెంకా అసహనం వ్యక్తం చేశారు.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది ముమ్మాటికీ అర్థం లేని పని. వారికి ఎందుకు ప్రత్యేక అధికారాలు ఉండాలి? ఐపీఎల్‌ను సృష్టించింది అభిమానులు. ప్రజాప్రతినిధులు కాదు. కానీ వారు దీనిని తమ జన్మహక్కుగా భావిస్తున్నారు. ఇటీవల ఒక ఆసియా దేశంలో ఒక ముఖ్యమైన క్రీడా ఈవెంట్ కోసం ప్రమోటర్ నుంచి రెండు ఉచిత టిక్కెట్లు తీసుకున్నందుకు ఒక మంత్రిని పదవి నుంచి తొలగించారు. ఆ టికెట్లను బహుమతిగా తీసుకున్నానని ఆయన చెప్పలేదు.'అని పేర్కొన్నారు.