ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు.

పిచ్ స్లోగా ఉండటంతో పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరహాలోనే లక్నో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రిషభ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయాన్ని అందించాడు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో ఆఖరి వరకు క్రీజులో నిల్చోని గెలిపించాడు. ఆఖరి ఓవర్‌ను ఉనాద్కత్ కట్టడిగా వేసి ఉంటే ఫలితం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అనుకూలంగా ఉండేది.
ఎందుకంటే చివరి 12 బంతుల్లో లక్నో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్‌ను హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా వేసాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. దాంతో సన్‌రైజర్స్ శిభిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ జయదేవ్ ఉనాద్కత్ వరుసగా రెండు బౌండరీలు ఇచ్చి గెలుపు ఆశలను నీరుగార్చాడు. ఆ తర్వాతి రెండు బంతులను డాట్ చేసిన ఉనాద్కత్ ఐదో బంతికి మరో బౌండరీ ఇచ్చి సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు.
బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఉనాద్కత్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు. అతను కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే సన్‌రైజర్స్ విజయం సాధించేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అతని వైఫల్యం కారణంగా నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ విరోచిత పోరాటం వృథా అయ్యింది.