ఆ ఇద్దరే.. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్ని అందించారని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఇద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం, మిడిల్ ఓవర్లలో ఆడిన తీరు తమను విజేతగా నిలబెట్టాయని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
కళ్లు చెదిరే బ్యాటింగ్..
'ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ అసాధారణ బ్యాటింగ్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వారు ఆడిన కొన్ని షాట్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్‌ఫుట్‌పై స్ట్రెయిట్ షాట్స్ కొట్టడం, స్పిన్నర్లను ఎదుర్కోవడం అద్భుతంగా అనిపించాయి. ఇలా షాట్స్ ఆడాలంటే చాలా ధైర్యం, నిలకడ కావాలి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మ్యాచ్ చేజారిపోవచ్చు. కానీ వారు ఆ భాగస్వామ్యాన్ని నిర్మించిన తీరు, ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆడిన విధానం అద్భుతం.

నేను కూపర్, ప్రియాంష్‌తో ఇప్పుడే సిక్సర్ల గురించి మాట్లాడాను. ఈ ఇద్దరికి సిక్సర్ల పోటీ పెట్టాను. ఈ ఐపీఎల్‌లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి బహుమతిగా నా బ్యాట్ ఇస్తానని చెప్పాను. ఇది వినడానికి వింతగా అనిపించినా.. వారు ప్రదర్శన ఇస్తున్నంత కాలం నాకు సంతోషమే. ఆటగాళ్లకు స్వేచ్చనిచ్చినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మా మంత్రం కూడా అదే.
ప్రత్యేకంగా ఏం చెప్పను..
నేను వారికి ప్రతి జట్టుపై ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పను. ప్రతి ఆటగాడికి ఒక పద్ధతి, వారి స్వంత దినచర్యలు ఉంటాయి. వారు వాటిని అనుసరిస్తూ ఫలితాలను సాధిస్తున్నారు. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రికీ పాంటింగ్ మ్యాచ్‌కు ముందు అందరినీ ఉత్సాహపరుస్తారు, నేను కూడా కొన్ని మాటలు చెబుతాను. అంతే.. మా కుర్రాళ్ళు మైదానంలోకి వెళ్లి అదరగొడుతున్నారు.
మా జట్టులోని మెజారిటీ బౌలర్లు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. వారు తమ జట్ల కోసం ఎంత బాగా ఆడుతున్నారో మీరు చూశారు. వారికి అపారమైన అనుభవం ఉంది. కాబట్టి నేను వారికి కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. మేము చర్చించుకుంటాం, బ్యాటర్లకు వ్యతిరేకగా ప్లాన్స్ వేస్తాం. వాటిని అమలు చేయడం మాత్రమే ముఖ్యం. ఈరోజు మా బౌలింగ్ తీరు అద్భుతంగా ఉంది. ఏ దశలోనూ నిర్లక్ష్యం వహించకుండా ఇలాగే కొనసాగాలి.
మా కంచు కోటగా మార్చుకున్నాం..
న్యూ చండీగఢ్‌ను మా కంచు కోటగా మార్చుకుంటున్నాం. మ్యాచ్‌కు ముందు వికెట్‌ను చూసినప్పుడల్లా ఈ జట్టులో భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గత ఏడాది మేం ఈ సీజన్ కోసం చాలా ఆలోచించాం. మా బ్యాటర్లు, బౌలర్లకు ఇద్దరికీ సహకరించేలా వికెట్‌ను ఎలా నిర్మించాలో ప్లాన్ చేశాం. ఇప్పటివరకు అంతా బాగుంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications