IPL 2026: శాతగాని కొడుకులు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఊరించిన ఆరెంజ్ ఆర్మీ అసలు సిసలు పోరులో చేతులెత్తేసింది. ఎలిమినేటర్ పోరులో అనూహ్యంగా తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏమాత్రం ఊహించని ఈ పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. SRH టైటిల్ గెలిచిన ఐపీఎల్ 2016 పరిస్థితులు తలపించడంతో ఈ సారి ఆరెంజ్ ఆర్మీదే టైటిల్ అని వారు కలలు కన్నారు.
కానీ ఏమాత్రం పోటీ కాదనుకున్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిని చూసి ఖంగుతిన్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ప్రణాళికలతో రాకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది. 15 ఏళ్ల కుర్రాడు భారీ సిక్సర్లు బాదుతుంటే.. ఏం చేయలేక సన్‌రైజర్స్ ఆటగాళ్లంతా చూస్తూ నిలబడిపోయారు.
బెడిసి కొట్టిన యార్కర్ల వ్యూహం..
యార్కర్లతో బేబీ బాస్‌ను కట్టడి చేయాలనే వ్యూహం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నట్టేట ముంచింది. కచ్చితమైన యార్కర్లు సంధించకపోవడంతో వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. అతని విధ్వంసంతో మరింత ఒత్తిడికి గురైన సన్‌రైజర్స్ బౌలర్లు తప్పు మీద తప్పు చేశారు. బౌలింగ్‌లో లయ తప్పి పరుగులు సమర్పించుకున్నారు. తుఫానులా సాగిన వైభవ్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌ను సర్వనాశనం చేసింది. ఆ తర్వాత తిరిగి పుంజుకున్నా లాభం లేకపోయింది.

వైభవ్ చెలరేగినా.. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసినా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై SRH బ్యాటింగ్ లైనప్ చెలరేగుతుందని అభిమానులు ఆశించారు. కానీ కాటేరమ్మ చిన్నకొడుకు అభిషేక్ శర్మ సిల్వర్ డకౌట్ అయితే.. నడిపోడు ట్రావిస్ హెడ్ చేతులెత్తేసాడు. ఇక పెద్దోడైన హెన్రీచ్ క్లాసెన్ అయినా జట్టును ఆదుకుంటాడని భావించగా.. అతను వెనుదిరిగాడు.
శాతగాని కొడుకులు..
మన తెలుగోడు నితీష్ రెడ్డి, యువ బ్యాటర్ సలీల్ అరోరా కాస్త పోరాడినా అది సరిపోలేదు. సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ 196 పరుగులు చేసింది. అంటే ఒక్క బ్యాటర్ క్రీజులో సెట్ అయినా ఈ లక్ష్యాన్ని SRH ఛేదించేది. కానీ వైభవ్ పెట్టిన భయం, ఒత్తిడి సన్‌రైజర్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టేలా చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కొందరు అభిమానులు.. వీళ్లు కాటేరమ్మ కొడుకులు కాదని, శాతగాని కొడుకులని మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications