తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఇంకొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. మిచెల్ సాంట్నర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని దాంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.
టాస్ సందర్భంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. యువ ప్లేయర్ మయాంక్ రావత్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. 'టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ పర్వాలేదు. కొన్నిసార్లు టాస్ ఓడిపోవడం కూడా మంచిదే. ఈ మ్యాచ్‌లోనైనా మేం మెరుగైన ప్రదర్శన చేయాలి.

ఇప్పటి వరకు మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ కొన్ని తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాం. కీలక సమయాల్లో పట్టు కోల్పోతున్నాం. ఈ మ్యాచ్‌లో ఆ తప్పిదాలు చేయకుండా చూసుకుంటాం. గత మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 20 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాం. టీ20 క్రికెట్‌లో ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఒక జట్టుగా మాకు ఆ విషయం తెలుసు. అటువంటి భారీ ఓవర్లు పడకుండా ఎలా నియంత్రించాలో మాకు తెలుసు. మేం దాని గురించి చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈరోజు అది ఎలా జరుగుతుందో చూద్దాం.
గత మ్యాచ్ నుంచి రోహిత్ దూరంగా ఉన్నాడు. అతను కోలుకోవడానికి ఇంకా కొన్ని మ్యాచ్‌లు పట్టవచ్చు. మిచెల్ శాంట్నర్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు. కాబట్టి జట్టులో కొన్ని మార్పులు ఉన్నాయి. క్వింటన్ డి కాక్ తిరిగి వచ్చాడు. మయాంక్ రావత్ ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఈ సీజన్‌లో తమ జట్టుకు అద్భుతమైన ఆరంభం దొరికిందని చెప్పిన అయ్యర్.. ప్రతీ మ్యాచ్‌పై ఫోకస్ పెట్టాలని తమ ఆటగాళ్లకు చెప్పానని తెలిపాడు. టీ20ల్లో ఏ క్షణం ఏం జరిగేది తెలియదని, నిరంతరం అలర్ట్‌గా ఉండాలని చెప్పానని పేర్కొన్నాడు. పిచ్ పొడిగా ఉండటంతో పాటు డ్యూ వచ్చే అవకాశం ఉందని తెలిపాడు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.