ఆట కాదు.. చెత్త ప్రణాళికలే మా ఓటమికి కారణం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ వరుస ఓటములకు చెత్త ప్రణాళికలే కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో తమ వ్యూహాలు బెడిసి కొట్టాయని తెలిపాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆర్‌సీబీ ఆధిపత్యం చెలాయించగా.. ముంబై ఇండియన్స్ తేలిపోయింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్ ఏ మాత్రం బాలేదని అభిప్రాయపడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లో ఆరంభంలోనే వెనుకబడిపోతున్నామని, మ్యాచ్ మొత్తం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అసహనం వ్యక్తం చేశాడు. తమ ప్రణాళికలను పూర్తిగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.
మ్యాచ్ మొత్తం పోరాడటమే అవుతుంది..
'ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం. అదే సమయంలో బౌలింగ్‌లోనూ చాలా ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. మేం ఎప్పుడూ మ్యాచ్‌లో వెనుకబడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. గత రెండు మ్యాచ్‌ల్లో ఇలానే జరిగింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో మేం ఆటను నడిపించడం కంటే.. వెనుకబడి పోరాడటమే అవుతుంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో మేం కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి.

అత్యుత్తమ ప్రదర్శన కోసం ఏం చేయాలో..? అవసరమైన మూమెంటమ్‌ను ఎలా పొందాలో వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. మా తదుపరి మ్యాచ్‌కు రెండు రోజుల విరామం ఉంది. ఈ రెండు రోజుల్లో మా లోపాలను సరిదిద్దుకోవాలి. చాలా విషయాలపై పునరాలోచన చేయాలి. మా వ్యూహాలు అస్సలు పనిచేయడం లేదు.
మా ప్లాన్స్‌ను మార్చాలి..
మా ప్రణాళికలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యామ్నాయ బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్స్‌ను ప్రయత్నించాలి. పిచ్‌ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మేం ఇంకా మంచి క్రికెట్ ఆడాలి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సత్తా చాటాలి. అలా రాణించినప్పుడే టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు సాధించగలం.
పవర్ ప్లేలోనే మూమెంటమ్ అందుకోవడం ఎలా? అనేది మేం చర్చించాల్సిన కీలక విషయం. ఎందుకంటే మేం గత మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పవర్ ప్లేలోనే వెనుబడిపోయాం. జట్టులోని ఇతర ఆప్షన్స్‌ను పరిశీలిస్తాం. రూథర్‌ఫర్డ్ అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. రూథర్ ఫోర్డ్‌ను నమ్ముకొని జట్టు అవసరాలకు తగ్గట్లు మార్పులు చేయవచ్చనే భరోసా ఏర్పడింది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
రూథర్ ఫోర్డ్ పోరాడినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), రజత్ పటీదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications