ఇలా ఆడితే.. ఏం చెప్పాలి: హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా నాలుగో పరాజయం ఎదురవ్వడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇలా ఆడితే ఏం చెప్పాలని ఎదురు ప్రశ్నించాడు. తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడటానికి ఏం లేదని ఒక్క మాటతో తేల్చేసాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ ప్రదర్శన గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్ మూడు విభాగాల్లో తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిందని అంగీకరించాడు.
మాటల్లేవ్..
'నిజాయితీగా చెప్పాలంటే.. ఈ ఓటమి గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. మేం ఎక్కడ వెనుకబడుతున్నామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లోపం ఆటగాళ్లలో ఉందా? జట్టులో ఉందా? లేక ప్రణాళికల్లో ఉందా? అనేది విశ్లేషించాలి. తప్పిదాలను గుర్తించి తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ప్రత్యర్థి జట్టుకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.

బంతి రివర్స్ స్వింగ్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం వల్ల పరిస్థితులు కొంచెం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయి. కానీ పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. మమ్మల్ని చిత్తుగా ఓడించింది.
టీమ్ కాంబినేషన్ విషయంలో మేం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా? లేక ఇలాగే కొనసాగిస్తూ పరిస్థితులు మారుతాయని ఆశించాలా అనేది చూడాలి. ఇవి మమ్మల్ని వెంటాడుతున్న కొన్ని కఠినమైన ప్రశ్నలు.. వీటికి మేం సమాధానాలు వెతకాలి. ఈ ఓటమికి మేం బాధ్యత వహించాల్సిందే.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
పంజా విసిరిన పంజాబ్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులే చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో రాణించినా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లుకు 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో అల్లా గజన్‌ఫర్(2/31) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(1/42) ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్‌లోనూ జస్‌ప్రీత్ బుమ్రా(0/41) ఒక్క వికెట్ తీయలేకపోగా.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications