ఐపీఎల్ 2026 సీజన్‌కు వేళైంది. అసలు సిసలు టీ20 మజాను అందించేందుకు పది జట్లు సిద్దమయ్యాయి. మూడు వారాల క్రితం టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు.. ప్రత్యర్థులు కాబోతుండగా.. ప్రత్యర్థులు సహచరులుగా మారుతున్నారు. వచ్చే రెండు నెలలు సందడే సందడి ఉండనుంది. 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజా అందనుంది.
అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ముందు బౌలర్ల పరిస్థితి తలుచుకుంటేనే జాలి వేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యంగా మారిన ఈ ఆటలో బౌలర్లు సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మారిపోయారని ఆవేదనకు లోనవుతున్నారు. క్రికెట్‌కు పేరు మార్చి బ్యాటింగ్ అని పెట్టుకోండి అని ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ఎక్కిరించాడూ అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కానీ ఒకప్పుడు బ్యాట్‌కు బంతికి సమతూకమైన ఆట ఉండేదని చెబితే ఈ జెన్ జీ, జనరేషన్ ఆల్ఫా తరం నమ్ముతుందా? భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ తన కెరీర్‌లో ఒక నోబాల్ వేయలేదంటే ఎలా రియాక్ట్ అవుతారో..? షేన్ వార్న్ బాల్ ఆఫ్ సెంచరీ వీడియో చూస్తే ఏం అంటారో..? వార్న్ వేసిన బంతి లెగ్ వికెట్‌కు సుదూరంగా పడి బ్యాటర్ కాళ్ళ వెనుకనుంచి ఆఫ్ స్టిక్ ను ఎగరగొట్టడం చూస్తే పిచ్చోళ్లవుతారు. వరల్డ్ కప్ సెమిస్ లో మోహిందర్, కీర్తి ఆజాద్ 24 ఓవర్లు వేసి కేవలం 55 పరుగులే ఇచ్చారంటే నోరెళ్లబెడుతారేమో?
అప్పటి ఆట.. బౌలింగ్ ఏమైంది? బ్యాటర్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరంలో 20 ఓవర్లలో 250 పరుగులు చేసినా ఆ జట్టు గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. బ్యాటర్లు చితక్కొడుతుంటే.. పాపం బౌలర్లు నెత్తికి చేతులు పెట్టుకొని చెమటలు చిందిస్తున్నారు. బ్యాటర్లను కట్టడి చేయలేక విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఒకప్పుడు 60 ఓవర్ల మ్యాచ్ లో అత్యధిక స్కోర్ 334 మాత్రమే. ఆ తర్వాత 60 ఓవర్లు కాస్తా 50కి తగ్గాక కూడా 250 డిఫెండబుల్ గా ఉండేది. మెల మెల్లగా అది 300కు చేరింది. ఆస్ట్రేలియా మీద 434 ఛేజ్ చేస్తూ సౌతాఫ్రికా విజయం సాధించినపుడు కలీస్ ' వాళ్ళు ఇంకో పదిహేను పరుగులు తక్కువ కొట్టారు ' అన్నాడంటే ఎంత మార్పో అర్ధం చేసుకోవచ్చు.
అప్పటికి 50 ఓవర్ల అత్యధిక స్కోర్ 481. ఆ తరవాత 50 ఓవర్ల మ్యాచ్ లు కూడా బోర్ కొట్టడం మొదలయ్యాక పొట్టి ఫార్మాట్ మొదట్లో 160 కొడితే చాలనుకునేవాళ్ళు. అది అలవోకగా 180 మీదుగా 200 కు చేరింది. ఇప్పుడు 225, 250 పరుగులు కూడా సులువుగా ఛేజ్ చేస్తున్నారు. 300 కొట్టేదిశగా బ్యాటర్లు దూసుకెళ్తున్నారు. బ్యాటర్ల ఆధిపత్యంలోనూ జస్‌ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు మెరుస్తున్నారు. కానీ బౌలర్లకు అనుకూలంగా క్రికెట్ నియమాలను మార్చాలని, బంతికి, బ్యాట్‌కు పోటీ సమంగా ఉండేలా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కనీసం సమతూకంగా ఉండే పిచ్‌లు సిద్దం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.