ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తమ నూతన కెప్టెన్‌గా యువ ప్లేయర్ రియాన్ పరాగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'రాయల్స్ ఫ్యామిలీ.. మీ కొత్త కెప్టెన్‌కు మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైంది'అనే క్యాప్షన్‌తో రియాన్ పరాగ్ ఫొటోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
తమ పాత సారథి సంజూ శాంసన్.. ట్రేడింగ్ విండో ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. చెన్నై నుంచే తెచ్చుకున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు దక్కుతాయని అంతా భావించినా.. రాజస్థాన్ రాయల్స్ మెనేజ్‌మెంట్ యువ సారథి వైపే మొగ్గు చూపింది. గత సీజన్‌లో సంజూ శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ తాత్కలిక కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. దాంతోనే మేనేజ్‌మెంట్ అతనివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

17 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన రియాన్ పరాగ్.. ఇప్పటి వరకు 84 మ్యాచ్‌లు ఆడి 141.84 స్ట్రైక్‌రేట్‌తో 1566 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్ 7 వికెట్లు తీసాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2024లో జింబాబ్వే పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్.. 9 అంతర్జాతీయ టీ20లే ఆడి 106 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు తీసాడు. ఒకే ఒక వన్డే ఆడిన రియాన్ పరాగ్ 15 పరుగులు చేసవాడు. బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన రియాన్ పరాగ్.. మళ్లీ అవకాశాన్ని అందుకోలేకపోయాడు.
ఎంతో ప్రతిభ కలిగిన రియాన్ పరాగ్ తరుచూ అభిమానుల ఆగ్రహానికి గురవుతాడు. మైదానంలో అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, సెలబ్రేషన్స్, ముఖ్యంగా పరుగులు చేయనప్పుడు కూడా అతను చూపించే 'స్వాగ్' వల్ల ట్రోలింగ్‌కు గురవుతుంటాడు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో వివాదాస్పద సెర్చ్ హిస్టరీ కనిపించడం, ఇతర ఆటగాళ్లపై కామెంట్స్ చేయడం వంటివి అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. గ్రౌండ్స్‌మెన్‌తో అతిగా ప్రవర్తించడం వంటి ఘటనలతో నెటిజన్లు అతనికి యాటిట్యూడ్ స్టార్‌గా బిరుదు ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కడంతో రియాన్ పరాగ్ ఆగడని, యాటిట్యూడ్ స్టార్ ఓవరాక్షన్ మైదానంలో కొనసాగుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.