టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జడేజా.. తొలి మ్యాచ్‌ను తన పాత ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌పైనే ఆడాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో జడేజా రెండు కీలక వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్‌తో మాట్లాడుతూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఖలీల్ జెర్సీపై ఉన్న సీఎస్‌కే లోగోను ముద్దు పెట్టుకొని ఎల్లో ఫ్రాంచైజీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజా ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసింది. 13 ఏళ్ల పాటు తాను ప్రాతినిథ్యం వహించిన జట్టుకు వ్యతిరేకంగా మైదానంలో దిగడం వింతగా అనిపించిందని జడేజా తెలిపాడు. ఈ ట్రెడింగ్ తర్వాత ధోనీతో మాట్లాడలేదని స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడేజా..'మహీభాయ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతాడు కాబట్టి అతనితో మాట్లాడలేదు. ఇప్పటికీ అతనితో మాట్లాడలేదు. కానీ కలిసినప్పుడు అన్నీ విషయాలు చర్చించుకుంటాం.’అని జడేజా నవ్వుతూ చెప్పాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో రాజస్థాన రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన జడేజా.. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్‌కే గెలిచిన 2018, 2021, 2023 ఐపీఎల్ టైటిల్స్‌లో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తిరిగి రావడంపై స్పందిస్తూ.. ఈ మార్పును అంగీకరించినట్లు తెలిసాడు. 'పింక్ జెర్సీ నాకు బాగానే ఉందనిపిస్తుంది. దూబె నాకు చాలా కాలంగా తెలుసు. స్పిన్ బౌలింగ్‌లో అతను భారీ షాట్లు ఆడుతాడని తెలుసు. అందుకే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాను. గౌహతి పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో నా బౌలింగ్‌ను ఆస్వాదించా’అని జడేజా చెప్పుకొచ్చాడు.