ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాను అంపైర్లు అడ్డుకున్నారు. అతని బ్యాట్‌ను బ్యాట్‌గేజ్ పరికరంతో పరీక్షించి నిబంధనలకు విరుద్దంగా ఉందని, బ్యాటింగ్ చేయడానికి వీల్లేదని చెప్పారు. దాంతో రాహుల్ తెవాటియా మరో బ్యాట్ తెప్పించుకొని తన బ్యాటింగ్ కొనసాగించాడు.
సాధారణంగా మైదానంలోకి వచ్చే ముందే ఫోర్త్ అంపైర్.. బ్యాటర్ల బ్యాట్లను పరీక్షిస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఏమైందో ఏమో కానీ మైదానంలోకి వచ్చిన తర్వాత రాహుల్ తెవాటియా బ్యాట్‌ను పరీక్షించారు. ఫోర్త్ అంపైర్ కళ్లు గప్పి రాహుల్ తెవాటియా వచ్చాడా? లేకా ఫోర్త్ అంపైర్ పరీక్షించడం మరిచిపోయాడా? అనేది తెలియదు.

కానీ రూల్స్ విరుద్దంగా ఉన్న బ్యాట్ తెచ్చిన రాహుల్ తెవాటియాను అంపైర్లు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నెట్టింట వైరల్‌గా మారింది. రాహుల్ తెవాటియా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.10 బంతుల్లో ఒక ఫోర్‌తో 11 పరుగులు మాత్రమే చేసి అజేయంగా నిలిచాడు.
మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నిబంధనల ప్రకారం, క్రికెట్ బ్యాట్ పరిమాణంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. బ్యాటర్లు తమ ఇష్టానుసారం భారీ వెడల్పు ఉన్న బ్యాట్లను వాడకుండా ఉండటానికి అంపైర్లు ఈ గేజ్‌తో పరీక్షిస్తారు. అంపైర్ బ్యాట్‌ను ఆ 'గేజ్' మధ్యలో ఉన్న రంధ్రం గుండా పంపినప్పుడు, అది ఎక్కడా ఆగకుండా సులభంగా లోపలికి వెళ్లి అవతలి వైపుకు రావాలి. ఒకవేళ బ్యాట్ అక్కడ ఇరుక్కుపోయినా లేదా దూరకున్నా, ఆ బ్యాట్ నిబంధనలకు విరుద్ధమని అర్థం. అప్పుడు ఆ బ్యాట్‌ను వాడటానికి అనుమతించరు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 6 ఫోర్లతో 39), జోస్ బట్లర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), గ్లేన్ ఫిలిప్స్(17 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 25) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్(3/34) మూడు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్‌కు ఒక వికెట్ దక్కింది.