IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు!
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టులోని ఓవర్‌సీస్ పేసర్ బ్రైడన్ కార్స్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతని స్థాన్నాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేశారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు ఉపయోగపడుతాడని భావించిన బ్రైడన్ కార్స్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దిల్షాన్ మదుషంకను రూ.75 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. అతి త్వరలోనే మదుషంక జట్టుతో కలవనున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన మదుషంక పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగలడు.

శ్రీలంక తరఫున 28 వన్డేలు, 19 టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన మదుషంక రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలం పెరగనుంది. ఇప్పటికే అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే మధుషంకకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఎషాన్ మలింగా ఫామ్ కోల్పోతే తప్పా మధుషంక తుది జట్టులో ఆడలేడు.
రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 28), సలీల్ అరోరా(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డోనవన్ ఫెరీరా(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), రవీంద్ర జడేజా(32 బంతుల్లో 5 ఫోర్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సకీబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండింటిలో గెలిచి మూడింటిలో ఓడింది. తమ తదుపరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications