ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ పిసినారిగా ప్రవర్తించిందని, ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు సరితూగే ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగంపై ఫోకస్ పెట్టలేదని మండిపడుతున్నారు. కానీ దేశవాళీ క్రికెట్‌పై ఏ మాత్రం అవగాహన ఉన్నవారు ఎవరైనా ఈ విమర్శలను తప్పుబడుతారు.
ఎందుకంటే ఈ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలివిగా వ్యవహరించింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. అంతేకాకుండా కొందరి ఆటగాళ్లపై ఉద్దేశపూర్వకంగా బిడ్ వేసి ధరను అమాంతం పెంచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోర్ టీమ్ మొత్తం విదేశీ ఆటగాళ్లతోనే నిండి ఉండటంతో దేశవాళీ ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టింది. జట్టుకు బలహీనంగా మారిన బౌలింగ్‌ను బలోపేతం చేసింది. ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసిన 10 మంది ఆటగాళ్లలో 8 మంది బౌలర్లే. ఇందులో నలుగురు ఆల్‌రౌండర్లు ఉండగా.. ఒకరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉన్నారు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉండగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కోసం చివరి వరకు ప్రయత్నించిన సన్‌రైజర్స్ ఆఖర్లో వదిలేసింది. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన మెరుగ్గా లేకపోవడంతోనే వెనకడుగు వేసింది. అతనికి బదులు లెఫ్టార్మ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్‌తో పాటు చైనామన్ బౌలర్ క్రియిన్స్ ఫులేత్రాను తీసుకుంది. ఈ ఇద్దరితో పాటు డేంజరస్ బ్యాటర్ కమ్ స్పిన్నర్ లివింగ్ స్టోన్‌ను తీసుకుంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు అంచనాలతో రాణించినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదు. క్రియిన్స్ ఫులేత్రా, శివాంగ్ కుమార్‌లను సన్‌రైజర్స్ ట్రయల్స్‌లో పరీక్షించి తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.
ఈ ఇద్దరూ రూ.30 లక్షలకే దక్కడంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ సంతోషం వ్యక్తం చేసింది. క్రియిన్స్ ఫులేత్రా బౌలింగ్ శైలి కుల్దీప్ యాదవ్‌ను పోలీ ఉంటుంది. సౌరాష్ట్రకు చెందిన ఈ యువ బౌలర్ సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది లీగ్‌గా నిలిచాడు. గతేడాది సన్‌రైజర్స్‌కు నెట్‌బౌలర్‌గా సేవలు అందించాడు. జయదేవ్ ఉనాద్కత్ సహకారంతో అతనికి ఈ అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన శివాంగ్ కుమార్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలడు.
ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా సలీల్ అరోరాను తీసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. షకీబ్ హుస్సేన్, ఒంకార్ తర్మాలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావీలతో బౌలింగ్ బెంచ్‌ను బలంగా మార్చుకుంది. జాక్ ఎడ్వర్డ్స్, లివింగ్ స్టోన్ వంటి క్యాప్‌డ్ ఆల్‌రౌండర్లను తీసుకుంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మలతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. వీరికి లివింగ్ స్టోన్ జత కలిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో ఇషాన్ మలింగా, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్‌తో పేస్ విభాగం పటిష్టంగానే ఉంది. జీషన్ అన్సారీ, హర్ష్ దూబేలతో స్పిన్ విభాగం కట్టుదిట్టంగా ఉంది.
వీరికి అభిషేక్ శర్మ నుంచి సహకారం లభించనుంది. చైనామన్ బౌలర్ క్రియిన్స్ ఫులేత్రా కూడా సత్తా చాటితే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదు. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఆర్‌సీబీని కూడా ఇలానే ట్రోల్ చేశారు. సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కానీ ఆ జట్టే విజేతగా నిలిచింది. పేరున్న ఆటగాళ్ల కంటే కంటెంట్ ఉన్న ప్లేయర్లపై సన్‌రైజర్స్ ఫోకస్ పెట్టింది. వారి వ్యూహాలు ఫలిస్తే ఈ సారి ఆరెంజ్ ఆర్మీదే టైటిల్.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే.