IPL 2026: తుది జట్టు ఎంపికలో కావ్య మారన్ జోక్యం: SRH ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. టైటిల్ గెలవకున్నా ఆధిపత్య ఆటతీరుతో ప్లే ఆఫ్స్ చేరింది. పేలవ రన్‌రేట్‌తో తృటిలో టాప్-2 ప్లేస్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్‌లో అనూహ్యంగా ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ఇంటిబాట పట్టింది.
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ గురించి ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ షాకింగ్ విషయం చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కావ్య మారన్ జోక్యం చేసుకుందని ఆరోపించాడు. ఐపీఎల్ ముగించుకొని స్వదేశం వెళ్లిపోయిన లివింగ్ స్టోన్ అక్కడ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కావ్య మారన్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో తనకు చోటు దక్కలేదని తెలిపాడు.

ముంబైని దెబ్బతీసింది..
కావ్య మారన్ తనకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కన పెట్టించిందని పరోక్షంగా వెల్లడించాడు. సదరు ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్‌తో పోటీ పడి మరీ కొనుగోలు చేసిందని తెలిపాడు. 'ముంబై ఇండియన్స్‌కు అవసరమైన ఓ యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో సన్‌రైజర్స్ దగ్గర చాలా డబ్బులు ఉండటంతో ఆ ఆటగాడిని కొనుగోలు చేయడం సాధ్యమైంది. మా ఓనర్ పట్టుబట్టి మరీ అతన్ని తీసుకుంది. అతనంటే మా ఓనర్‌కు చాలా ఇష్టం. దాంతో తుది జట్టులో అతని చోటు ఖాయమైపోయింది.
ముగ్గురు ఓవర్‌సీస్ ప్లేయర్లతోనే ఎందుకు ఆడుతున్నామని మా కోచ్ డానియల్ వెటోరిని ప్రశ్నిస్తే.. ఈ విషయాన్ని నాతో చెప్పాడు. కమిన్స్ వచ్చినా మేం ఈ విధానం మార్చమని తెలిపాడు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ఎవరో ఒకరు గాయపడితే తప్ప నాకు తుది జట్టులో చోటు దక్కదని తెలిసింది. మనం ఎలాగూ ఆడబోమని తెలిసినప్పుడు మన మానసిక స్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఓనర్స్ సూచనలతోనే..
తుది జట్టు ఎంపికలో టీమ్ ఓనర్స్ పూర్తిగా జోక్యం చేసుకున్నారా? లేదా? అనేది నాకు తెలియదు. వారి అభిప్రాయాలు, సూచనలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ప్లాన్స్ గురించి డాన్ వెటోరి ముందే చెప్పడం నాకు పెద్ద ఊరటనిచ్చింది. నాకు అవకాశం లేదనే విషయం నాకు ముందే తెలుసు.'అని లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చాడు.
ఇదే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్..'ఈ యజమానులకు క్రికెట్‌లో ఉన్న నైపుణ్యం ఏంటి?'అని ప్రశ్నించగా.. 'చాలా డబ్బు ఉండటమే'అని అదే పాడ్‌కాస్ట్‌లో ఉన్న అలిస్టర్ కుక్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే కావ్యమారన్‌కు అంతగా నచ్చిన ఆటగాడు సలీల్ అరోరా అని తెలుస్తోంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ముంబై ఇండియన్స్ పోటీ పడగా.. సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 156 పరుగులే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications