IPL 2026: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లేవ్.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2026 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో ఈ సారి ఎలాంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని ఆర్‌సీబీ నిర్ణయించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో టైటిల్‌ను ముద్దాడింది. అయితే భద్రతా కారణాలు, పోలీసుల మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ పరేడ్ ర్యాలీ నిర్వహించకూడదని ఆర్‌సీబీ నిర్ణయించినట్లు పీటీఐ పేర్కొంది.
11 మంది చనిపోవడంతో..
గతేడాది ఆర్‌సీబీ తమ తొలి టైటిల్ అందుకున్న తర్వాత బెంగళూరు నిర్వహించి విజయోత్సవ వేడుక విషాదంగా ముగిసింది. చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు కర్ణాటక ప్రభుత్వం, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని చర్యలు తీసుకునేలా చేసింది.

ఈ విషాద ఘటన నేపథ్యంలోనే ఈ సారి విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని ఆర్‌సీబీ నిర్ణయించింది. అంతేకాకుండా కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండటంతో ఆర్‌సీబీ విజయోత్స ర్యాలీ నిర్వహించకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. లోక్ భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రత, అధిక పోలీసు బలగాలు అవసరం. గవర్నర్ నివాసం చిన్నస్వామి స్టేడియంకు దగ్గరగా ఉండటంతో ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయాల్సి ఉంది.
అంతర్జాతీయ సిరీస్‌లు ఉండటంతో..
'బెంగళూరులో ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం లేదు. పోలీసులు నిర్దేశించిన మార్గదర్శకాలను మేం తప్పనిసరిగా పాటించాలి’అని ఓ ఆర్‌సీబీ అధికారి మీడియాకు తెలిపారు. బెంగళూరు పోలీసులు కూడా గతంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకోవడం ఆపాలని సూచించారు. భద్రతా కారణాలతో పాటు.. పలువురు ఆర్‌సీబీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు జట్టును వీడనున్నారు.
దేవదత్ పడిక్కల్ ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టులో చేరనుండగా... జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ వంటి విదేశీ ఆటగాళ్లు తమ జాతీయ జట్ల తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ నిలిచినా.. విజయోత్సవ వేడుకలు లేకుండా పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications