రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా తన పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీస్తే వరల్డ్ రికార్డ్ నమోదు చేయనున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లోనే 200 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్రకెక్కనున్నాడు.
ఇప్పటివరకు 190 మ్యాచులు ఆడిన ఈ ఆర్‌సీబీ స్వింగ్ కింగ్ 27.33 సగటుతో 198 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు, రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రమే అతని కంటే ముందున్నాడు.
అత్యధిక ఐపీఎల్ వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ తర్వాత ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అతను 145 మ్యాచుల్లో 22.02 సగటుతో 183 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో 161 మ్యాచుల్లో 183 వికెట్లతో బుమ్రా సరసన నిలిచాడు. ఈ సీజన్‌లో బుమ్రా 200 వికెట్ల మైలురాయి అందుకునే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను ఆర్‌సీబీ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లతో పోటీపడి మరి కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లతో ఆర్‌సీబీ విజయంలో భువీ కీలక పాత్ర పోషించాడు. ఆర్‌సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌కు కొత్త బంతితో అద్భుతమైన రికార్డు ఉంది. పవర్‌ప్లే ఓవర్లలో అతను అత్యధికంగా 79 ఐపీఎల్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మాత్రమే ఈ భారత వెటరన్‌కు దగ్గరగా ఉన్నాడు. పవర్‌ప్లేలో తీసిన మొత్తం 79 వికెట్లలో 29 వికెట్లను ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పడగొట్టడం అతని ప్రత్యేకత.
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 43 పరుగులిచ్చి ఒకే వికెట్ తీసాడు. ట్రావిస్ హెడ్ మాత్రమే ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.