ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. గతేడాది అశుతోష్ శర్మ తమకు తొలి విజయాన్ని అందిస్తే.. ఇప్పుడు సమీర్ రిజ్వీ గెలిపించాడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన అక్షర్ పటేల్.. సమీర్ రిజ్వీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతను అద్భుతమైన ఆటగాడని, తన ఆట కోసం చాలా కష్టపడుతాడని కొనియాడాడు. 'ఈ మ్యాచ్ త్వరగానే ముగిసింది కానీ.. మధ్యలో ఆట చాలా ఉత్కంఠగా మారింది. మాకు ఒక మంచి భాగస్వామ్యం అవసరమని బ్రేక్ సమయంలో మాట్లాడుకున్నాం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.

మేం బౌలింగ్ ప్రారంభించినప్పుడు.. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందుతుందని మాకు తెలుసు. అదే విషయాన్ని బౌలింగ్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ తెలియజేశాం. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి, బౌండరీల దూరాన్ని గమనిస్తూ ఎవరితో బౌలింగ్ చేయించాలో నిర్ణయించుకున్నాను. అయితే చివర్లో నేను లెక్కించడంలో చిన్న పొరపాటు జరిగి ఉండవచ్చు.
మా ప్రణాళిక ప్రకారం సమీర్ రిజ్వీనే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకున్నాం. అలాగే అశుతోష్ శర్మను బ్యాకప్ ఆప్షన్‌గా పెట్టుకున్నాం. గతేడాది అశుతోష్ శర్మ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈసారి రిజ్వీ ఆ పని చేశాడు. అతను తన ఆట కోసం చాలా కష్టపడతాడు. తనను తాను ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39) అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ తలో వికెట్ తీసారు.