IPL 2026: కొంపముంచిన ఫెరీరా.. రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం న్యూఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను ఢిల్లీ క్యాపిటల్స్ సజీవంగా ఉంచుకుంది.
మరోవైపు ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. డోనోవన్ ఫెరీరా చెత్త బౌలింగ్ రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్,అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన ఢిల్లీకి విజయాన్నందించింది. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా రాజస్థాన్ రాయల్స్ కొంపముంచాయి.

గెలిపించిన అక్షర్, అషుతోష్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/40) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, మాధవ్ తివారి రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(42 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 56), అభిషేక్ పోరెల్(31 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), అషుతోష్ శర్మ(5 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. డసన్ షనక ఒక వికెట్ పడగొట్టాడు.
కొంపముంచిన ఫెరీరా
194 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో చివరి 18 బంతుల్లో ఢిల్లీ విజయానికి 31 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో డోనవన్ ఫెరీరాకు బంతినిచ్చి రియాన్ పరాగ్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఓవర్‌లో ఫెరీరా రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో పాటు మొత్తం 16 పరుగులిచ్చుకున్నాడు.
దాంతో మూమెంటమ్ ఢిల్లీ వైపు మళ్లింది. బ్రిజేష్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ ఔటైనా.. అషుతోష్ శర్మ సిక్సర్ బాదాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా.. మిల్నే బౌలింగ్‌లో అషుతోష్ వరుసగా రెండు సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. 18వ ఓవర్‌ను ఫెరీరా కాస్త కట్టడిగా వేసి ఉంటే ఫలితం రాజస్థాన్ రాయల్స్‌కు అనుకూలంగా ఉండేది.
మలుపు తిప్పిన మిచెల్ స్టార్క్..
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. తాను వేసిన 15వ ఓవర్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్, డొనోవాన్ ఫెరీరాలను వరుస బంతుల్లో ఔట్ చేసిన స్టార్క్.. ఐదో బంతికి రవి సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. దాంతో 193 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications