ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ మినీ ఆక్షన్‌కు తెరలేవనుంది. మంగళవారం అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించి వేలానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయా జట్లకు మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) గురించి మాట్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ మాజీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వేలానికి ముందే సీఎస్కే పటిష్టంగా ఉందని, ఆ జట్టు మరో ఇద్దర్నీ తీసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగానే.. తదుపరి సీజన్ కోసం జట్టును బలోపేతం చేయడంపై సీఎస్‌కే ఫోకస్ పెట్టింది. ఈ పనిని మెచ్చుకున్న బంగర్.. ఆయుష్ మాత్రే వంటి అప్‌కమింగ్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశమని తెలిపాడు.

సీఎస్‌కే రూ.43.40 కోట్ల భారీ పర్స్ మనీతో మినీవేలం బరిలోకి దిగుతుంది. ఆ జట్టుకు నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. సీఎస్‌కే ఆక్షన్ ప్లాన్స్‌పై మాట్లాడిన సంజయ్ బంగర్.. మరో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేస్తే సీఎస్‌కే తుది జట్టు బలంగా మారుతుందని చెప్పాడు.
'గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేమని తెలిసిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఆయుష్ మాత్రేతో ఒప్పందం కుదర్చుకుంది. అతను కచ్చితంగా తుది జట్టులో ఆడుతాడు. నేనైతే అతన్ని ఫస్ట్ డౌన్‌లో ఆడించాలని చెబుతాను. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ సీఎస్‌కే ఇన్నింగ్స్ ప్రారంభించాలి. డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలో ఒకరు నాలుగో స్థానంలో ఆడుతారు. అయితే ఈ ఇద్దరూ నెంబర్ 5, 6లో బ్యాటింగ్ చేయాలి. నాలుగో స్థానం కోసం అనుభవం కలిగిన ఓవర్‌సీస్ బ్యాటర్‌ను కొనుగోలు చేయాలి. ఈ స్థానానికి లియామ్ లివింగ్ స్టోన్‌తో పాటు కామెరూన్ గ్రీన్ సరిగ్గా సరిపోతారు.
బౌలింగ్ విభాగంలో సీఎస్‌కే.. నాథన్ ఎల్లిస్‌ను ఉపయోగించుకోవాలి. అతను కొత్త బంతితో బాగా రాణిస్తాడు. అతను మంచి ఫీల్డర్ కూడా. కాబట్టి అతను సీఎస్‌కే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. అదనపు స్పిన్ బౌలర్, ఒక భారత ఫాస్ట్ బౌలర్, ఒక విదేశీ ఆల్‌రౌండర్‌ను ఎంచుకుంటే సీఎస్‌కే టీమ్ పటిష్టంగా మారుతుంది.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.