ఐపీఎల్ 2026 వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో పోటీపడి మరి దక్కించుకుంది. అయితే రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా ఆర్‌సీబీ తుది జట్టులో వెంకటేశ్ అయ్యర్‌కు చోటు దక్కదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ అని, తమ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు.
వాస్తవానికి ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా వెంకటేశ్ అయ్యర్ కోసం ఆర్‌సీబీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కేకేఆర్ రూ.23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడంతో వెనకడుగు వేసింది. కానీ వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చాడు. 11 మ్యాచ్‌ల్లో 20.29 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతన్ని వేలంలోకి వదిలేసిన కేకేఆర్.. తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని భావించింది. కానీ ఆర్‌సీబీ పోటీ పడటంతో వదిలేసింది.

తాజాగా జియో హాట్ స్టార్ కార్యక్రమంలో మాట్లాడిన అనిల్ కుంబ్లే.. ఆర్‌సీబీ వేలం వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వెంకటేష్ అయ్యర్ ప్రతిభావంతమైన ఆటగాడు. కానీ ఆరంభ మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కడం అనుమానమే. ఎందుకంటే ఆర్‌సీబీ ఇప్పుడు ఛాంపియన్ టీమ్. ఇంత త్వరగా ట్రోఫీని గెలుచుకున్న టీమ్ తమ కాంబినేషన్‌ను మార్చాలనుకోదు. జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని అనుకుంటారు. రవి బిష్ణోయ్ వంటి సీనియర్ స్పిన్నర్లను ఆర్‌సీబీ తీసుకోకపోవడానికి కారణం కూడా ఇదే. సుయాష్ శర్మ ఇప్పటికే జట్టులో బాగా రాణిస్తున్నాడు. ఆర్‌సీబీ సీనియర్ స్పిన్నర్‌ను తీసుకొని యువ ఆటగాడు సుయాష్ శర్మపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దని భావించింది. వెంకటేశ్ అయ్యర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.
వేలానికి ఆర్‌సీబీ చాలా స్పష్టమైన ప్రణాళికతో వెళ్లింది. వారు తమ కీలక ఆటగాళ్లకు సరైన బ్యాకప్‌లను ఎంచుకున్నారు. జట్టు బలం తగ్గకుండా వారు చూసుకున్నారు. జోష్ హజెల్ వుడ్‌కు బ్యాకప్‌గా జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్‌కు ప్రత్యామ్నాయంగా జోర్డాన్, యష్ దయాల్‌కు బ్యాకప్‌గా మంగేష్ యాదవ్‌ను కొనుగోలు చేసింది.'అని కుంబ్లే ప్రశంసించాడు.