ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రీన్ కవర్ డ్రైవ్ ఆడితే మోచేయి విరుగుతుందా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రీన్.. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
ఆల్‌రౌండర్ అయిన గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో కేకేఆర్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై అజింక్యా రహానేను హోస్ట్ ప్రశ్నించగా.. క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలని బదులిచ్చాడు.
అతను బౌలింగ్ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా అడ్డుకుంటుందని పరోక్షంగా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ మాత్రమే చేసిన గ్రీన్.. 10 బంతుల్లో 18 పరుగులే చేశాడు. ఇంత భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది కేవలం బ్యాటింగ్ చేయాడానికేనా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన అంబటి రాయుడు.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో బౌలింగ్ చేయవద్దని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ లీగ్స్‌పై క్రికెట్ బోర్డుల పెత్తనం ఏంటి? అని మండిపడ్డాడు.
'గ్రీన్.. కవర్ డ్రైవ్ ఆడగలడా లేదా? అతని మోచేతికి గాయం అవుతుందని ఫ్లిక్ షాట్ మాత్రమే ఆడుతాడేమో. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా ఒక టోర్నీ ఆడటానికి వచ్చినప్పుడు.. 'నువ్వు ఇది చేయాలి.. ఇది చేయకూడదు' అని చెప్పడం పూర్తి అసంబద్ధం. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇలా అస్సలు జరగకూడదు. అయితే ఈ విషయంలో ఆటగాడే తుది నిర్ణయం తీసుకోవాలి. ప్రొఫెషనల్ టోర్నీ ఆడుతున్నప్పుడు తన సాయశక్తులా ఆడే సామర్థ్యం అతనికి ఉండాలి. తన గురించి ఆటగాడే ఉత్తమ న్యాయ నిర్ణేత.
బ్యాటింగ్ చేసేటప్పుడు హెల్మెంట్ ధరించాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. కానీ నాకు హెల్మెట్ పెట్టుకోవడం నచ్చదు. అంతమాత్రాన మా అమ్మ నేను ఆడకుండా అడ్డుకోలేదు కదా? నా కొడుకు గాయపడుతాడని కాంట్రాక్ట్ రద్దు చేయించదు కదా?'అని రాయుడు ప్రశ్నించాడు.
కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడానికి క్రికెట్ ఆస్ట్రేలియా కారణమని రహానే చేసిన వ్యాఖ్యలపై ఆ బోర్డు ఘాటుగా స్పందించింది. వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయలేడని, ఈ విషయంపై కేకేఆర్‌కు ముందే సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చింది. లోయర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న గ్రీన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిపింది. అతని గాయంపై కేకేఆర్ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్‌కు సమాచారం ఇచ్చామని స్పష్టం చేసింది.
కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. హర్షిత్ రాణా, మతీషా పతిరనా గాయాలతో జట్టు ఇప్పటికే సతమతమవుతోంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా జట్టు నుంచి దూరం కావడంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. గ్రీన్ బౌలింగ్ చేస్తేనే కేకేఆర్ బౌలింగ్ కష్టాలు తీరనున్నాయి.