Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ గెలుపు క్రెడిట్ వారిదే.. అతని శతకం ఎక్కువ సంతోషాన్నిచ్చింది: అజింక్యా రహానే

ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధించిన విజయం కంటే ఫిన్ అలెన్ ఫామ్ అందుకోవడం, శతకం సాధించడం ఎక్కువ సంతోషాన్నిస్తుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. ఈ గెలుపు క్రెడిట్ తమ బౌలర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కే దక్కుతుందని తెలిపాడు. వారి అద్భుతమైన కృషితోనే వరుస విజయాలు దక్కుతున్నాయని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రహానే.. ఫిన్ అలెన్‌తో పాటు బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయం దక్కిందని చెప్పాడు.

గెలుపు కంటే శతకమే..

'ఈ గెలుపు కంటే ఫిన్ అలెన్ ఫామ్ అందుకోవడం, శతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తొలి 4-5 మ్యాచ్‌ల్లో ఫామ్ అందుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఈ రోజు అతను బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. మా బౌలర్లు కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చారు. వారి వల్లే ఈ విజయం సాధించాం. ముఖ్యంగా మా బౌలర్లు మిడిల్, డెత్ ఓవర్లలో నిలకడగా రాణిస్తున్నారు. మా స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ, అనుకుల్ రాయ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ఫీల్డింగ్ విషయానికి వస్తే.. మేం చాలా కష్టపడుతున్నాం. మా ఫీల్డింగ్ కోచ్ మా పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు. అది మాకు ఎంతో సహాయపడుతోంది. మా టీమ్ ఆటగాళ్లు అందుకుంటున్న అసాధారణ క్యాచ్‌లు, గ్రౌండ్ ఫీల్డింగ్ ఫలితాల క్రెడిట్ మా ఫీల్డింగ్ కోచ్‌కే దక్కుతుంది.

IPL 2026 KKR Skipper Ajinkya Rahane Credits Finn Allen Spinners and Coaching Staff for Dominant Win Over DC
Photo Credit: screen grab for JioHotstar

నరైన్‌ను వదిలేస్తా..

బౌలింగ్ విషయంలో నరైన్‌‌కు నేను పూర్తి స్వేచ్ఛనిస్తాను. నా జట్టులో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి వారు ఉండటం కెప్టెన్‌గా నా అదృష్టం. వారికి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. నరైన్ ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా చాలా ఏకాగ్రతతో ఉంటూ.. ఇతర ఆటగాళ్ల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన అనుభవాన్ని అందరితో పంచుకుంటాడు.

అతను తన అనుభవాన్ని పంచుకోవడం ఫీల్డ్ లో నాకు కూడా ఎంతో సాయపడింది. అందుకే నేను ఎప్పుడు రమ్మన్నా అతను బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మేం డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ 'ప్రస్తుత క్షణం'లో ఉండటం గురించే చర్చించుకుంటాం.

వరుణ్ బాగానే ఉన్నాడు..

తొలి ఐదు మ్యాచ్‌ల్లో మేము చాలా మంచి క్రికెట్ ఆడాం. ఈ ఫార్మాట్‌లో కీలక సమయాల్లో అప్రమత్తంగా, చురుగ్గా ఉండటమే మాకు విజయాన్ని అందించింది. అయితే మా బౌలింగ్ కోచ్‌లు టిమ్ సౌథీ, డ్వేన్ బ్రావోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వారు బౌలర్లతో కలిసి చాలా కష్టపడుతున్నారు. దేశవాళీ సీజన్‌లో అద్భుతంగా రాణించిన అనుకుల్ రాయ్ ప్రదర్శనను నేను చాలా సంతోషిస్తున్నాను.

కార్తీక్ త్యాగి కూడా స్పష్టమైన ఆలోచనలతో.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ చాలా బాగా రాణించారు. మొత్తంగా బౌలింగ్ యూనిట్‌గా మేం చాలా బాగున్నాం. వరుణ్ బాగానే ఉన్నాడు. ఎలాంటి గాయం కాలేదు. చాలా సంతోషంగా బౌలింగ్ చేస్తాడు. కానీ ఫీల్డింగ్ చేయమంటే మాత్రం బయటకి వెళ్లిపోతానంటాడు(నవ్వుతూ). అతను ఫిట్‌గా ఉన్నాడు. మేం ప్రతీ మ్యాచ్‌ను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాం.'అని రహానే చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 9, 2026, 6:10 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+