ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ సుయాష్ శర్మ ఇల్లీగల్ ఫీల్డింగ్ చేశాడు. బంతిని చేతులతో కాకుండా క్యాప్‌తో కలెక్ట్ చేశాడు. అయితే బంతి అప్పటికే డెడ్ కావడంతో ఐదు పరుగుల పెనాల్టీ నుంచి ఆర్‌సీబీ తప్పించుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. అంపైర్లు ఆర్‌సీబీకి అనుకూలంగా వ్యవహరించారని, 5 పరుగులు పెనాల్టీ విధించాల్సిందని ఓ వర్గం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిదంటే..
యశ్ దయాల్ వేసిన 9వ ఓవర్ ఆఖరి బంతికి నితీష్ రాణా కవర్స్ వైపు ఆడాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడం సింగిల్ రాలేదు. అయితే ఫీల్డర్ విసిరేసిన బంతి స్టంప్స్‌ను తాకి షార్ట్ థర్డ్ ఫీల్డర్‌వైపు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న సుయాష్ శర్మ.. బంతిని తన క్యాప్‌తో తీసుకున్నాడు. 10వ ఓవర్ వేసేందుకు కృనాల్ పాండ్యా రాగా.. బంతిని ఇచ్చేందుకు అంపైర్లు నిరాకరించారు. సుయాష్ శర్మ మిస్ ఫీల్డ్ గురించి థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లారు. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి డెడ్ అయిందని ప్రకటించాడు. దాంతో ఆర్‌సీబీ ఊపరి పీల్చుకుంది.

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటీ..?
ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని ఆర్టికల్ 28 ప్రకారం.. ఫీల్డర్ తన శరీరంలోని ఏ భాగంతోనైనా బంతిని ఆపవచ్చు.. తీసుకోవచ్చు. అలా కాకుండా అతని దగ్గర ఉన్న వస్తువులు(క్యాప్, కర్చీఫ్)తో బంతిని ఆపే ప్రయత్నం చేసినా.. తీసుకున్నా ఇల్లీగల్ ఫీల్డింగ్ అవుతుంది. ఇల్లీగల్ ఫీల్డింగ్‌కు పెనాల్టీగా బ్యాటింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. అయితే బంతి డెడ్ అయిన తర్వాత సుయాశ్ శర్మ బంతిని క్యాప్‌తో తీసుకోవడంతో బచాయించాడు. లేకుంటే ఆర్‌సీబీకి 5 పరుగులు పెనాల్టీ విధించేవారు. అలా జరిగి ఉంటే ఫలితం తారుమారయ్యేది.
ఆర్‌సీబీ తొలి విజయం..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి మైదానంలో ఆర్‌సీబీకి ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. 19వ ఓవర్‌లో హజెల్ వుడ్ మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలుపు తిప్పాడు. క్రీజులో సెట్ అయిన ధ్రువ్ జురెల్‌తో పాటు వానిందు హసరంగాలను ఔట్ చేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఆర్‌సీబీకి విజయం దక్కింది.