ఐపీఎల్‌లో సాధారణంగా సెలువు దినమైన ఆదివారం డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కానీ ఐపీఎల్ 2025 సీజన్‌లో నేడు(ఆదివారం) ఒకే ఒక్క మ్యాచ్ జరుగుతుండటం అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం(ఎప్రిల్ 5) రెండు మ్యాచ్‌లు నిర్వహించి.. సెలవు దినమైన ఆదివారం ఒక్క మ్యాచ్ నిర్వహించడం ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ముందస్తు ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం నేడు(ఆదివారం) రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. సాయంత్ర కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. కానీ శ్రీరామ నవమి నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడంతో కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు.

శ్రీరామ నవమి సంబరాల మధ్య మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టతరమైన విషయమని కోల్‌కతా పోలీసులు స్పష్టం చేయడంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, బీసీసీఐ ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశాయి. ఏప్రిల్ 8న(మంగళవారం) రెండు మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాయి. వాయిదా పడిన కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్ర పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. శ్రీరామ నవమి కారణంగా ఈ రోజు జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్ వాయిదా పడింది. దాంతోనే ఆదివారం ఒక్క మ్యాచే జరుగుతుంది.