ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోకి మరో తెలుగు కుర్రాడు అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్ బరిలోకి దిగాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈ 20 ఏళ్ల కుర్రాడు దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రోఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు. గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూసిన ఈ తెలుగు కుర్రాడు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగి 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అచ్చం రుతురాజ్ గైక్వాడ్ తరహాలోనే బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడి ఆట తీరుకు కెప్టెన్ ధోనీతో పాటు ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు ఫిదా అయ్యారు. అతని అద్భుతమైన ఆరంభం..ధోనీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. ఐదు వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది. షేక్ రషీద్ జట్టులోకి రాగానే చెన్నై గెలవడంతో ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ షేక్ రషీద్..?
ఐపీఎల్ 2023 సీజన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన షేక్ రషీద్.. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ఆ జట్టులోనే కొనసాగాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి దిగినా.. అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షల కనీస ధరకు సీఎస్‌కే.. షేక్ రషీద్‌ను తిరిగి కొనుగోలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తెలుగు తేజం ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు.

అండర్ 19 ప్రపంచకప్‌తో..
మూడేళ్ల క్రితం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ 2022తో షేక్ రషీద్ భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చాడు. ఈ మెగా టోర్నీలో షేక్ రషీద్ భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించాడు. సెమీఫైనల్, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దేశవాళీ క్రికెట్‌లో షేక్ రషీద్ ఆంధ్ర తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక డబుల్ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలతో 1204 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 352 పరుగులు చేశాడు. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత.
ధోనీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది.
ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్)తో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర(22 బంతుల్లో 5 ఫోర్లతో 37), అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, ఆవేశ్ ఖాన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. సీఎస్‌కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
షేక్ రషీద్ తన జోరును ఇలానే కొనసాగిస్తే జట్టులో కీలక బ్యాటర్‌గా మారనున్నాడు. గుంటూరుకే చెందిన అంబటి రాయుడిలా స్టార్ క్రికెటర్‌గా ఎదగనున్నాడు.