ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో స్టార్ ఉద్భవించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిబంతికే వికెట్ తీసి తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. అతను ఎవరో కాదు.. ముంబై ఇండియన్స్ పేస్ సెన్సేషన్ అశ్వని కుమార్..! కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ముంబై ఇండియన్స్ లెఫ్టార్మ్ పేసర్.. 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన అశ్వని కుమార్.. తన రెండో ఓవర్‌లో డేంజరస్ రింకూ సింగ్‌తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. రింకూ సింగ్‌ను క్యాచ్ ఔట్ చేసిన అశ్వని కుమార్.. మనీశ్ పాండేను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక తన మూడో ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దాంతో అశ్వని కుమార్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎవరీ అశ్వని కుమార్..?
అశ్విన్ కుమార్ పంజాబ్‌కు చెందిన లెఫ్టార్మ్ పేసర్. బౌన్సర్లతో పాటు వైడ్ యార్కర్లు వేయడం అతని స్పెషాలిటీ. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వని కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు ముంబై స్కౌట్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. పంజాబ్ తరఫున 2022లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అశ్వని కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు తీసాడు. నాలుగు లిస్ట్-ఏ, రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైనా అశ్వని కుమార్‌కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ముంబై ఇండియన్స్ తరఫున వచ్చిన అవకాశాన్ని అశ్వని కుమార్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన సంచలన ప్రదర్శనతో బుమ్రా లేని లోటును తీర్చాడు.